కెటిఆర్ వ్యవహార శైలి భేష్
కైటెక్స్ గ్రూప్ ఛైర్మన్ సాబూ కితాబు
కేరళ సర్కారుకు ఘాటైన చురకలు
కొచ్చి : కేరళలో పరిశ్రమల విభాగం బావిలో కప్ప స్థితిలో ఉందని కైటెక్స్ గ్రూప్ ఛైర్మన్ సాబూ జాకబ్ విమర్శించారు. తెలంగాణను చూసి అయినా నేర్చుకోవాలని చురకలు పెట్టారు. ఇతర రాష్ట్రాలలో ఏ విధమైన పెట్టుబడుల అనుకూల విధానాలు ఉన్నాయి? పారిశ్రామికవేత్తలను ఏ విధంగా రప్పించడం వంటి వాటిపై ఈ విభాగానికి ఎటువంటి పరిజ్ఞానం లేదని జాకబ్ తెలిపారు. పెట్టుబడులను రప్పించుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాగా వ్యవహరిస్తోందని జాకబ్ సోమవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు.తన కంపెనీలకు, పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విరివిగా ప్రోత్సాహకాలు అందించిందని తెలిపారు. ఎటువంటి తనిఖీలు లేకుండానే అనుమతులు ఉంటాయని భరోసా ఇచ్చారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం తమకు చవక ధరకు భూములు ప్రతిపాదించింది.
నీరు, విద్యుత్ వంటివి పెట్టుబడిదార్లకు లొసుగులు లేకుండా ఇవ్వనుందని తెలిపారు. అయితే కేరళలో పరిశ్రమల విభాగం ఇందుకు భిన్నంగా ఉందని, ఎక్కడేసిన గొంగళి అక్కడేలా ఉందని, ఈ విభాగం కదలకుండా ఉండే బావిలో కప్ప అని మండిపడ్డారు. కేరళలో తన కంపెనీల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు చేపట్టిందని, అనుమతులు వచ్చే అవకాశాలు లేవని అన్పిస్తోందన్నారు. అయితే ఇదే దశలో తెలంగాణ ప్రభుత్వం తనకు పూర్తిస్థాయిలో హామీలు ఇచ్చిందని, పరిశ్రమల స్థాపనకు వచ్చే వారిని తనిఖీల పేరిట ఇబ్బంది పెట్టడం జరగబోదని తెలిపిందని చెప్పారు. తెలంగాణ పరిశ్రమల మంత్రి కెటిఆర్‌తో తాను జరిపిన చర్చలు సంతృప్తిని ఇచ్చాయని, ఆయనతో చర్చలు మంత్రితో కాకుండా ఓ రాష్ట్రానికి సిఇఒతో జరిపినట్లుగా ఉన్నాయన్నారు. పరిశ్రమల స్థాపనల విషయంలో సిఒఒలు పాటించే మెళకువలు, సరైన వ్యవహార శైలిని కెటిఆర్ పూర్తిగా పాటిస్తున్నారని కితాబు ఇచ్చారు. కేరళలోని సింగిల్ విండో క్లియరెన్స్ పద్ధతి కాలం చెల్లిన విధానం అని , దీనిని ఇతర రాష్ట్రాలు పాతికేళ్ల క్రితమే అనుసరించాయని తెలిపారు.