సిఎం నేతృత్వంలో తెలంగాణ దూసుకెళ్తోంది
పెట్టుబడులకు హైదరాబాద్ అనువైనప్రాంతం
సింగపూర్ హైకమిషనర్‌తో మంత్రి హరీశ్ రావ్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రత్యేక రాష్ట ఉద్యమంతో ఎర్పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ముందుకు దూసుకెళ్తోందని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సోమవారం మంత్రి హరీశ్‌తో సింగపూర్ హైకమిషనర్ ఈ సమైన్ వాంగ్ తన బృందంతో కలిసి సమావేశమయ్యారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ పెట్టుబడులకు హైదరాబాద్ నగరం అత్యంత అనువైన ప్రాంతమని చెప్పారు. డేటా సెంటర్ల ఏర్పాటు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కార్పోరేట్ కంపెనీలు ఆసక్తితో ఉన్నట్టు సింగపూర్ హైకమిషనర్ తెలిపారు. ఇప్పటికే అమెజాన్ వంటి సంస్థలు తమ కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేశాయని మంత్రి వారికి వివరించారు. భౌగోళికంగా హైదరాబాద్ సురక్షితమైనదని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం సకల సౌకర్యాలతో ఫార్మా సిటిని ఏర్పాటు చేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రం వ్యాక్సిన్ హబ్‌గా మారిందన్నారు. అంతే కాకుండా సోలార్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అనువైనదన్నారు. ఏడాది పొడవులనా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చన్నారు. మౌళిక సదుపాయాలు, నాణ్యమైన విద్యుత్, రహదారులు, ఎయిర్ పోర్టు, శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రాంతం అనుకూలమని, పెట్టుబడులకు స్వర్గధామమని వివరించారు.
అనంతరం వారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆసక్తిగా అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు అని మంత్రి వివరించారు. వందమీటర్ల ఎత్తునుంచి 630మీటర్ల ఎత్తులో తెలంగాణ ప్రాంత ఉందని, గోదావరి నీటిని 630మీటర్ల ఎత్తువరకూ ఈ ప్రాజెక్టు లిఫ్ట్ చేస్తుందన్నారు. వ్యవసాయరంగంలో సమూల మార్పులు తెచ్చినట్టు తెలిపారు. రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, ఎకరానికి 5వేల చోప్పున రెండు పంటలకు రూ.10వేలు రైతుబంధు పంటపెట్టుబడి అందజేస్తున్నట్టు వివరించారు. రైతుల పంటను మద్దతు ధర చెలించి ప్రభుత్వమే పంటను కొనుగోలు చేసిందన్నారు. ఈ కారణంగానే రైతుల ఆత్మహత్యలును పూర్తి స్థాయిలో తగ్గించినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వరిధాన్యం ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ఈ ఏడాది 3కోట్ల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసినట్టు తెలిపారు. పంజాబ్ రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉండేదని, ఆ రాష్ట్ర గత ఏడాది 2.2కోట్ల టన్నులతో రెండవ స్థానంలో నిలిచిందన్నారు. విద్యుత్ రంగంలో స్వావలంబన సాధించామన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందన్నారు.
కేవలం పట్టణాలు, నగరాలే కాకుండా పల్లెల్లోనూ సమూలంగా మార్పులు తెచ్చామన్నారు. మంచి రోడ్లు వేశామని, చెత్త సేకరణ, డంప్ యార్డులు వంటి వసతులు పెంచామన్నారు. హరితహారం పథకం కింద మొక్కలు పెంచి తద్వారా ఈ ఏడేళ్లలో 2శాతం పచ్చదనం పెపొందించామన్నారు. ఈ దఫా పర్యటనకు వచ్చినప్పుడు తెలంగాణలోని పల్లెలను సందర్శించాలని, అక్కడ నెలకొన్న మౌళిక సదుపాయాలు, గ్రామీణ ప్రజల జీవన విధానం పరిశీలించాలని కోరారు. సిద్దిపేట జిల్లాను కూడా సందర్శించాలని మంత్రి హరీశ్‌రావు సింగపూర్ హైకమీషనర్ బృందాని కోరారు. ఈ సమావేశంలో హైకమిషన్ సెక్రటరీలు సెన్‌లిమ్, అమండా క్వెక్, పాంగ్ కాక్ టైన్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీశ్ రావు సింగపూర్ బృందాన్ని శాలువాలతో సత్కరించారు.
Harish Rao meeting with Singapore High Commissioner