ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు
అమ్మవారికి మొక్కలు చెల్లించుకున్న భక్తులు
హైదరాబాద్: హైదరాబాద్‌లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకకు జంట నగరాల నుంచి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈ వేడుకలను నిర్వహించారు. గతేడాది కరోనా కారణంగా ఆలయం లోపలే కల్యాణం నిర్వహించగా, కొవిడ్ కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం ఆలయం బయట భారీ ఏర్పాట్లు చేసింది. కార్యక్రమంలో జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.
కల్యాణ మహోత్సవం నిన్న ఎదుర్కోళ్లతో ప్రారంభమవ్వగా, మంగళవారం ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం జరిగింది. రేపు రథోత్సవంతో ఉత్సవం వైభవంగా ముగియనుందని నిర్వాహకులు తెలిపారు. అమ్మవారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావటంతో అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. పసుపుతో శివసత్తులు అమ్మవారిని కీర్తిస్తూ ఆడిపాడారు. బల్కంపేట ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అమ్మవారు స్వయంభూమూర్తిగా వెలిసిన ఎల్లమ్మగా, బల్కంపేట ఎల్లమ్మ తల్లిగా భక్తుల పూజలు అందుకుంటోంది. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడురోజుల పాటు జరిగే ఉత్సవాల్ని చూడ్డానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగొస్తారని ప్రతితీగా చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం సుమారుగా ఐదు లక్షలమంది జనం ఎల్లమ్మ కల్యాణానికి హాజరయ్యేవారు. కానీ గతేడాది నుంచి కరోనా కల్లోలంతో కల్యాణానికి హాజరయ్యే భక్తుల సంఖ్య భారీగా తగ్గిందని నిర్వాహకులు తెలిపారు.