ధర్మపురి ఇంట్లో ‘తీన్మార్’
ముగ్గురు నాయకులు… మూడు పార్టీలు
నిజామాబాద్ జిల్లాలో ఆసక్తిగా మారిన డిఎస్ కుటుంబ రాజకీయం
త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్న డిఎస్ తనయుడు సంజయ్
నిజామాబాద్/మనతెలంగాణ/హైదరాబాద్: ధర్మపురి ఇంట్లో తీన్మార్ నడుస్తోంది. ఇప్పుడు ఆయన ఇంట్లో మూడు పార్టీలకు చెందిన నాయకులు ఉండబోతున్నారు. ధర్మపురి శ్రీనివాస్ టిఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతుండగా, ఆయన కొడుకు ధర్మపురి అరవింద్ బిజెపి పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా, మరో తనయుడు సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇలా ఒకే ఇంట్లో మూడు పార్టీల నాయకులు ఉండడంతో జిల్లా ప్రజలు డిఎస్ కుటుంబాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ధర్మపురి శ్రీనివాస్ ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడుగా, కొంతకాలం మంత్రిగా పనిచేశారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ప్రస్తుతం డి.శ్రీనివాస్ ప్రస్తుతం టిఆర్‌ఎస్ నుంచి రాజ్యసభ ఎంపిగా ఉన్నా, చాలా కాలం నుంచి ఆయన ఆ పార్టీతో సంబంధాలను వదులుకున్నారు.
ప్రస్తుతం డిఎస్ మాత్రం టిఆర్‌ఎస్ పార్టీకి దూరంగా…
ఆయన తనయుడు ధర్మపురి అరవింద్ బిజెపిలో ఉంటూ నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న డిఎస్ మరో తనయుడు సంజయ్ మళ్లీ తెరపైకి వచ్చారు. టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి నియామకం తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం సంజయ్ జిల్లా నాయకులతో కలిసి రేవంత్ రెడ్డిని కలిశారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నాయకులు మూడు పార్టీలో కీలకంగా ఉండాలని భావిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం డిఎస్ మాత్రం టిఆర్‌ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ, తన ఇద్దరు కుమారులను రెండు పార్టీలకు దగ్గర చేస్తున్నారన్న గుసగుసలు వినబడుతున్నాయి.
అధిక ప్రాధాన్యత ఇచ్చిన టిఆర్‌ఎస్
ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్)కు టిఆర్‌ఎస్ పార్టీ అధిక ప్రాధాన్యత ఇచ్చి ఏడాది పాటు ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది. తర్వాత రాజ్యసభ సభ్యులుగా సిఎం కెసిఆర్ నియమించారు. రాజసభ సభ్యులుగా అయిన తరువాత డిఎస్ కుమారులు బిజెపిలో చేరడం, మరొకరిపై వివిధ ఆరోపణలు రావడంతో టిఆర్‌ఎస్ పార్టీ డిఎస్‌ను దూరం పెట్టింది. అప్పటి నుంచి డిఎస్ టిఆర్‌ఎస్‌తో దూరంగా ఉంటున్నారు.
ఢిల్లీలో చేరేందుకు తన సన్నిహితులతో….
సంజయ్ 2005 నుంచి 2010 వరకు నిజామాబాద్ జిల్లా తొలి మేయర్ గా పనిచేశారు. ప్రస్తుతం టిపిసిసి అధ్యక్షుడిగా నియమితులైన రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సంజయ్ మంగళవారం ప్రకటించారు. ఢిల్లీలో చేరేందుకు తన సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది.
నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడే అవకాశం?
నిజామాబాద్ జిల్లాలోని రాజకీయాల్లో డిఎస్ తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కుటుంబం నుంచి విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ధర్మపురి కుటుంబం నుంచి కాంగ్రెస్, టిఆర్‌ఎస్, బిజెపి పార్టీలలో ఉండటంలో జిల్లాలో చర్చకు దారితీసింది. జిల్లాలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాలేదని రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. డిఎస్ ఇంట్లో మూడు పార్టీల నాయకులు ఉండటంతో నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్తలకు, నాయకులకు లాభం ఉన్న లేకున్న డిఎస్ కుటుంబానికి అన్ని పార్టీలు అండగా ఉంటాయన్న చర్చ జోరుగా జిల్లాలో వినిపిస్తుంది.
Dharmapuri Sanjay meets TPCC Chief Revanth Reddy