అంటిగా: వెస్టిండీస్ దిగ్గజం..యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ట్వంటీ20 క్రికెట్‌లో అరుదైన రికార్డును సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టి20 మ్యాచ్ సందర్భంగా గేల్ ఈ ఫార్మాట్‌లో 14వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. టి20 క్రికెట్ చరిత్రలోనే ఈ ఫీట్‌ను సాధించిన తొలి క్రికెటర్‌గా గేల్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ టి20 క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న గేల్ 14వ వేల పరుగులను సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. ఐపిఎల్‌తో సహా పలు టి20లలో గేల్ ఆడుతున్నాడు. కెరీర్‌లో అన్ని లీగ్‌లను కలిపి గేల్ ఇప్పటి వరకు 431 మ్యాచ్‌లు ఆడాడు.
ఇందులో ఏకంగా 14000 పరుగులను పూర్తి చేశాడు. ఇక వెస్టిండీస్‌కే చెందిన కిరన్ పొలార్డ్ 10836 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక గేల్ సాధించిన రికార్డును బద్దలు కొట్టడం ఇతర క్రికెటర్లకు కష్టమేనని చెప్పాలి. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో గేల్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. చెలరేగి ఆడిన గేల్ 38 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 67 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా విధించిన 142 పరుగుల లక్ష్యాన్ని విండీస్ మరో 31 బంతులు మిగిలివుండగానే ఛేదించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను విండీస్ 30తో సిరీస్‌ను సొంతం చేసుకుంది.
Chris Gayle reach 14000 Runs in T20