మన తెలంగాణ/ కుబీర్: ఉపాధి హామి బిల్లులపై సంతకం చేయడం లేదన్న అక్కసుతో ఆ శాఖ టెక్నికల్ అసిస్టెంట్ పై ఒక గ్రామ సర్పంచ్ పెట్రోల్ చల్లి నిప్పంచాడు. ఈ దుర్ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలం కేంద్రంలో మంగళవారం సంభవించింది. మండల కేంద్రలోని ఈజిఎస్ కార్యలయంలో టెక్నికల్ అసిస్టెంట్ రావుల రాజు విధులు నిర్వహిస్తుండగా కుభీర్ మండలం పాతసావ్లి గ్రామ సర్పంచ్ సాయినాథ్ బకాయి ఉన్న బిల్లులపై సంతకం చేయడం లేదంటూ ఆయనపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అ క్కడున్న వారు వెంటనే రాజును భైంసాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 35% కాలిన గాయాలతో ఆయన చికిత్స పొందుతున్నాడు. వివరాల ప్రకారం.. ఓల్డ్ సావ్లీ గ్రామంలో రోడ్డు గ్రావెల్ పనులకు సం బంధించిన బిల్లుల చెల్లింపులపై గత కొ ద్ది రోజులుగా టిఏ రాజు, సర్పంచ్ సా యినాథ్ మధ్య గొడవలు జరుగుతున్నా యి. ఈ క్రమంలో బిల్లుల చెల్లింపుల విషయంలో రాజు ఉద్దేశ్యపూర్వకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ సర్పంచ్ కక్ష పెంచుకున్నాడని పలువురు అంటున్నారు. కాగా మంగళవారం సర్పంచ్ పెట్రోల్ డబ్బాతో కార్యాలయానికి వచ్చాడు. అక్కడ కొద్ది సేపు ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సర్పంచ్ తనతో తెచ్చుకున్న పెట్రోల్‌ను రాజుపై పోసి నిప్పంటించాడు. కార్యాలయంలో ఉన్న తోటి ఉద్యోగులు పొగలను చూసి వెళ్లి చూడగా కాలుతున్న రాజుపై నీళ్లు చల్లి ఆర్పారు. వెంటనే సర్పంచ్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. భైంసా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజు వద్దకు భైంసా రూరల్ సిఐ చంద్రశేఖర్ చేరుకొనివివరాలు తెలుసుకున్నారు. కుభీర్ తహసీల్దార్ ప్రభాకర్ ఆస్పత్రిలో పంచనామా నిర్వహించారు.
కావాలనే నిప్పంటించాడు (రాజు, ఈజీఎస్ , టిఏ)
సర్పంచ్ సాయినాథ్ నాపై రోడ్డు గ్రావెల్ బిల్లుల విషయంలో కక్ష పెంచుకున్నాడు. కావాలనే నాపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. నేను రూల్స్ ప్రకారమే పనిచేస్తున్నా.
బిల్లుల పైల్స్‌కు నిప్పటించాను (సాయినాథ్, సర్పంచ్)
మా గ్రామపంచాయతీలో పెండింగ్ బిల్లుల చెల్లింపులో టీఏ రాజు ఇబ్బంది పెట్టాడు. ఇది విసిగిపోయి పెండింగ్ బిల్లుల పైల్స్‌కు నిప్పంటించబోయాను అక్కడే ఉన్న రాజుపై పెట్రోల్ పడి గాయపడ్డాడు. కావాలని చేయలేదు.
దర్యాప్తు చేస్తున్నాం (చంద్రశేఖర్ సిఐ, భైంసా రూరల్)
టిఏ రాజుపై జరిగిన పెట్రోల్ దాడి విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటాం. తప్పు ఎవరిదైనా వారిపై చర్యలు తీసుకుంటాం. బాధితుడు రాజు పరిస్థితి నిలకడగా ఉంది. మెరగైన వైద్య చికిత్స కోసం నిర్మల్ తరలించాం.
Sarpanch sets ablaze on Technical Assistant in Nirmal