నకిలీ పత్రాలతో రూ.1.39 కోట్ల రుణం తీసుకున్న నిందితులు
హైదరాబాద్: నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంక్‌ను మోసం చేసిన ఇద్దరు నిందితులను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని సైదాబాద్‌కు చెందిన ముదావత్ శ్రీనివాస్, పాలత్య రవి ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రొగ్రాం కింది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి రూ.1.39కోట్లు రుణం తీసుకున్నారు. సిమెంట్ ఇటుక తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి రుణం తీసుకున్నారు. ఈ సమయంలో నిందితులు నకిలీ ఇన్‌వాయిస్, సప్లయర్స్, కాస్ట్‌కు సంబంధించిన ఎస్టిమేషన్‌ను ఇచ్చారు. రెంటల్ అగ్రిమెంట్‌ను కూడా నకిలీది సమర్పించారు. జయ్ సాయిరాం ఎంటర్‌ప్రైజెస్, శ్రీనాగు సాధు ఎంటర్‌ప్రైజెస్ పేరుతో సప్లయ్ చేస్తున్నామంటూ పేర్కొన్నారు. దీనిని చూసిన బ్యాంక్ అధికారులు రుణం మంజూరు చేశారు. రుణం తీసుకున్న నిందితులు తిరిగి చెల్లించడం మానివేశారు. దర్యాప్తు చేసిన బ్యాంక్ అధికారులకు నిజాలు తెలియడంతో ఇండియన్ ఓవర్‌సీస్ రీజినల్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్సై తిరుపతయ్య, హెచ్‌సిలు దర్యాప్తు చేశారు.