ఐదుగురు అరెస్టు….ధర్నాలు నిరసనలు
సిర్సా: హర్యానాలో సిర్సా పోలీసులు గురువారం ఐదుగురు రైతులను రాజద్రోహం అభియోగాలపై అరెస్టు చేశారు. హర్యానా డిప్యూటీ స్పీకర్ కారుపై రైతుల దాడి జరగడంతో వీరిపై ఇటీవలే ఈ చట్టం పరిధిలో కేసులు నమోదు చేశారు. వీరిని ఇప్పుడు అరెస్టు చేశారని వెల్లడైంది. డిప్యూటీ స్పీకర్ కారుపై దాడి ఆదివారం జరిగింది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు ఎదురుగా డిప్యూటీ స్పీకర్ కారు వచ్చిన దశలో రైతులు దాడి జరిపినట్లు అభియోగాలు ఉన్నాయి. ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వందమందికిపైగా ప్రదర్శనకారులపై కేసులు దాఖలు అయ్యాయి. ఐదుగురిని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు.
ప్రజా ప్రతినిధులపై దాడి, హత్యాయత్నాలు, ప్రజా ఆస్తుల విధ్వంసం, విధులకు ఆటంకాలు వంటి చర్యలకు పాల్పడినందున వీరిపై రాజద్రోహం కేసులు మోపారు. గురువారం రైతుల అరెస్టులకు నిరసనగా పలువురు రైతులు బాబా భూమన్ షా జి చౌక్ వద్ద ధర్నాకు దిగారు. వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తన కారుపై గుంపు రాళ్లు విసిరిందని, వారిని రైతులు అనడానికి వీల్లేదని, రైతులు ఎక్కడా ఎప్పుడూ ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడరని మంగళవారం డిప్యూటీ స్పీకర్ రణ్‌బీర్ గంగ్వా విలేకరులకు తెలిపారు. వారు తాగుబోతులుగా ఉన్నారని కూడా మండిపడ్డారు. దాడి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సిర్సా ఎస్‌పిని బదిలీచేసింది. ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారిని సస్పెండ్ చేశారు.