అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కొండపాక రిజర్వ్ ఫారెస్ట్ ల్లోకి ప్రజలు వెళ్లొద్దు
జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లాలోని కొండపాక రిజర్వ్ ఫారెస్ట్ లో చిరుత కలకలం సృష్టించింది. మల్లన్న సాగర్ జలాశయంను అనుకుని ఉన్న కొండపాక రిజర్వ్ ఫారెస్ట్ లోని పెద్ద బండ రాళ్ల పక్కనే నక్కిన చిరుత కనిపించింది. అటవీశాఖ సిబ్బంది గుర్తించి దూరం నుంచి తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. నల్లజుట్టు గల చిరుత పులి ( పాంథర్) గా అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత సంవత్సరం అంకిరెడ్డి పల్లి చెరువు వద్ద ఒక చిరుత ఉన్నట్లు గుర్తించామని, ప్రస్తుతం రెండు చిరుతలు అడవిలో సంచరిస్తున్నాయని జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు. చిరుత పిల్లల కూడ సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు తమకు కనిపించాయనీ వెల్లడించారు. అంకిరెడ్డి పల్లి చెరువు సమీపంలో సంచరించే చిరుతలు అప్పుడప్పుడు అడవీ సరిహద్దులకు వస్తున్నాయని వివరించారు. సమీప అటవీ ప్రాంతాల కు సమీపంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొండపాక రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లవద్దని జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీధర్ ప్రజలకు సూచించారు.