బెర్లిన్ : పశ్చిమ ఐరోపాలో వరదలు శనివారం తగ్గుముఖం పట్టడంతో మృతుల సంఖ్య 150 కి తేలింది. పశ్చిమ వరదలకు బాగా దెబ్బతిన్న జర్మనీ అహ్రవెయిలర్ కౌంటీలో 90 కన్నా ఎక్కువ మంది మృతి చెందినట్టు బయటపడిందని పోలీసులు చెప్పారు. ఎక్కువ మంది భయం వల్లనే చనిపోయారని తెలిపారు. జర్మనీలో అత్యధిక జనం రద్దీ కలిగిన ఉత్తర రైన్ వెస్ట్ ఫలియా రాష్ట్రం లో 43 మంది, బెల్జియంలో 27 మంది మృతి చెందారు. శనివారం వరద బాధిత ప్రాంతాల్లో వరద నీరు వెనక్కు మళ్లింది. అయితే వరద ప్రవాహానికి కొట్టుకు పోయిన కారుల్లో, ట్రక్కుల్లో కొన్ని శవాలు బయటపడవచ్చని అధికారులు భావిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇంకా విద్యుత్, టెలిఫోన్ సర్వీసులు పునరుద్ధరింప బడలేదు. రూర్ నది డ్యామ్‌కు గండి పడడంతో డచ్ సరిహద్దులో ఉన్న జర్మనీ నగరం వసెన్‌బర్గ్ లో దాదాపు 700 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
జర్మనీ, బెల్జియం లతోపాటు నెదర్లాండ్స్ దక్షిణ ప్రాంతాలు భారీ వరద ముంపునకు గురయ్యాయి. గండ్లను పూడ్చడానికి, రోడ్లను బాగు చేయడానికి రాత్రంతా వాలంటీర్లు శ్రమించారు. దక్షిణ డచ్చి పట్టణాలైన బుండే, వొల్వుమెస్, బ్రొమిలిన్, గుయెల్లే, నివాసులు శనివారం తిరిగి తమ ఇళ్లకు చేరుకోగలిగారు. ఆపద్ధర్మ ప్రధాని మార్క్ రుటే శుక్రవారం ఆ ప్రాంతాలను సందర్శించారు. ఆ ప్రాంతం మూడు వైపరీత్యాలను ఎదుర్కొందని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటిది కరోనా, రెండోది వరదలు, మూడోది జనం త్వరగా ఆ ప్రాంతాలను పరిశుభ్రం చేసి కోలుకోవలసి రావడం అని వివరించారు. స్విట్జర్లాండ్‌లో భారీ వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.