Friday, November 22, 2024

బెజవాడ దుర్గమ్మకు బంగారు బోనం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం నుంచి భక్తులు బోనం సమర్పించారు. ఆషాడ మాసం సందర్భముగా శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరము వలే ఈ ఏడాది కూడా తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారు ఆదివారం అమ్మవారికి బంగారు బోనం సమర్పించుటకు విచ్చేయగా బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి వద్ద దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, పాలకమండలి సభ్యులు స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకొని బంగారు పాత్రలో బోనం సమర్పించారు. ఆషాఢ మాసంలో తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ వైభవంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. హైదరాబాద్ పాతబస్తీలో కొలువైన శ్రీ మహంకాళీ అమ్మవారి ఆలయం నుంచి ఏటా సప్త మాతృకలకు సప్త బంగారు బోనాలు సమర్పిస్తారు. ఇందులో భాగంగా వరుసగా 12 ఏట తెలంగాణ నుంచి బోనాలు సమర్పించేందుకు భక్తులు విజయవాడకు వెళ్లారు. దుర్గ గుడి ఈవో భ్రమరాంబ, పాలకమండలి ఛైర్మన్ పైలా సోమినాయుడు, సభ్యులు ఈ సందర్భంగా నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. మేళతాళాల మధ్య బోనాన్ని ఎత్తుకున్న భక్తులు ఆనంద తాండవం చేశారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ కార్యక్రమంలో 250 మంది భక్తులు పాల్గొనడానికే అనుమతిచ్చారు.

ఈ నెల 30న కనక దుర్గమ్మ ఆలయం నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్లో వెలసిన అమ్మవార్లకు బోనం తీసుకెళ్లనున్నారు. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి నందలి దేవతామూర్తుల వద్ద ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు, పాలకమండలి సభ్యులు తెలంగాణా బోనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమమును ప్రారంభించారు. అనంతరం తెలంగాణా బోనాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు జమ్మిదొడ్డి నుంచి వివిధ కళాకారుల వేషధారణలు, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలతో కోవిడ్ నిబంధనలను అనుసరించి ఊరేగింపుగా బయలుదేరి రధం సెంటరు, ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారికి సమర్పించు బంగారు బోనం తలపై ఉంచుకుని అమ్మవారి ఆలయమునకు కాలినడకన చేరుకోగా ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తెలంగాణ బొణాల మహాంకాళి ఉమ్మడి ఆలయాల కమిటీ సభ్యులు కనకదుర్గ అమ్మవారిని దర్శనము చేసుకొని, అమ్మవారికి బోనం సమర్పించి, ఆలయ ఆవరణలోని రావి చెట్టు వద్ద ఉన్న దేవతామూర్తులకు పూజలు నిర్వహించడము జరిగినది. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు లింగంభొట్ల దుర్గాప్రసాద్ (ప్రధానార్చకులు), కనుగుల వెంకటరమణ (బాలా), నెలబట్ల అంబిక, నేతికొప్పుల సుజాత, బండారు జ్యోతి, కత్తిక రాజ్యలక్ష్మి, నెరుసు సతీష్, కటకం శ్రీదేవి, చక్కా వెంకట నాగ వరలక్ష్మి, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి, పర్యవేక్షకులు, అధికారులు పాల్గొన్నారు.
కనకదుర్గమ్మకు తెలంగాణ బంగారు బోనం: మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో బెజవాడ కనకదుర్గమ్మకు బంగారు బోనం అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగాయని ఎపి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ లో కూడా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఉత్సవాల్లో భాగంగా బోనాలను సమర్పణ తో పాటు నిర్వాహకులు, భక్తులు, కళాకారులు, పోతు రాజుల విన్యాసాలతో విజయవాడ బ్రహ్మణ వీధి నుంచి కళాకారుల నృత్యాలతో దేవాలయానికి సామూహిక ఊరేగింపు బయలు దేరి, అమ్మ వారి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో బోనాల ఉత్సవ కమిటి దేవాలయం ఈవో, ఆలయ కమిటి చైర్మన్ లతో పాటు అధికారులు ఉన్నారు.

Bangaru Bonam Offered to Bejawada Kanaka Durga

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News