అక్షరం, ఆర్ధికం, ఆరోగ్యం ఎజెండాగా
పూలే , అంబేద్కర్, కాన్షిరాం
ఆశయాల కోసం పోరాటం చేస్తా
ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త విప్లవం రాబోతోందని విఆర్‌ఎస్ ప్రకటించిన ఐపిఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఈ డెబ్బై, ఎనబై సంవత్సరాలలో అట్టడుగు వర్గాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. అక్షరం, ఆర్ధికం, ఆరోగ్యం ఎజెండాగా.. పూలే , అంబేద్కర్, కాన్షిరాం ఆశయాల కోసం పోరాటం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచే తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తానని ప్రకటించారు. మంగళవారం అదిలాబాద్‌లో నాగోబా ఆలయాన్ని సందర్శింంచారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ఒకప్పుడు ఐఐటి, ఎన్‌ఐటిల గురించి ఆదివాసీ బిడ్డలు ఇద్దరు ఖరగ్‌పూర్ ఐఐటి, వరంగల్ ఎన్‌ఐటికి ఎంపికయ్యారని అన్నారు. ఇలాంటి లక్షలాది మంది బిడ్డలు కొత్త ప్రపంచాన్ని చూస్తే బాగుంటుందన్న ఉద్దేశంతోనే తాను తన ఉద్యోగాన్ని వదులుకుని సేవ చేయడానికి వచ్చానని తెలిపారు. రాజకీయాల్లోకి రావడం తప్పు కాదని వ్యాఖ్యానించారు. రాజకీయాలతోనే మొత్తం వ్యవస్థ మారుతుందనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.
తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, రాబోయే రోజుల్లో తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. సాంఘిక సంక్షేమ కార్యదర్శిగా ప్రజల్లో ఒక శాతం మార్పు తీసుకువచ్చానని, ఇంకా 99 శాతం ప్రజల జీవితాలలో మార్పు కోసం పనిచేయనున్నట్లు వెల్లడించారు. సూర్యుడు తూర్పున ఉదయించి.. పశ్చిమాన అస్తమించేది.. ఎంత నిజమో.. ప్రవీణ్ కుమార్ పోటీ చేయకపోవడం అంతే నిజమని అన్నారు. పేద ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల బాటలోనే ముందుకుసాగుతానని, ఎట్టి పరిస్థితుల్లో ఆ బాట వదిలి వెళ్లనని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. తాను ఎవరినీ అమ్మను… ఎవరికీ అమ్ముడుపోనని అన్నారు. సాంఘీక సంక్షేమ కార్యదర్శిగా గూడెం బిడ్డలు విదేశాలలో చదివేలా ప్రోత్సహించానని, ఇలా అన్ని వర్గాల బిడ్డలు అభివృద్ధి చెందాలనేది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీ చేసే ఆలోచన తనకు లేదని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.