హైదరాబాద్ : భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి మంజూరు చేసే విషయమై సమీక్ష జరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) వెల్లడించింది. ఎప్పటికప్పుడు తాజాగా డేటాను సమీక్షించే తన వెబ్‌సైట్‌లో జులై 6న ఈ టీకా డేటాపై సమీక్ష ప్రారంభించింది. కొవాగ్జిన్ పూర్తి డేటా భారత్ బయోటెక్ జులై మొదటి వారం లోనే అందజేసిందని డబ్లుహెచ్‌వొ నిపుణుల బృందం వాటిని విశ్లేషిస్తోందని డబ్లుహెచ్‌వో ఆగ్నేయాసియా ప్రాంతీయ డైరెక్టర్ డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్ వెల్లడించారు.
భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా దీనిపై వివరిస్తూ ఎమర్జన్సీ యూజ్ లిస్టింగ్ (ఇయుఎల్) కింద కొవాగ్జిన్ గుర్తింపు ప్రక్రియ తుది నిర్ణయానికి చేరువలో ఉందని పేర్కొన్నారు. ఈమేరకు తమ సంస్థ ప్రపంచ ఆరోగ్యసంస్థతో చాలా సన్నిహితంగా పని చేస్తోందని ట్విటర్‌లో తెలియచేశారు. అనుమతి సుదీర్ఘకాలయాపనప్రక్రియ లో లేదని పేర్కొన్నారు. మూడు ట్రయల్స్ నుంచి వ్యాక్సిన్ సామర్ధం డేటాపై తుది విశ్లేషణ పూర్తయిందని భారత్ బయోటెక్ వివరించింది. కొవిడ్ 19 ను కట్టడి చేయడంలో 77.8 శాతం , డెల్టా వేరియంట్ కట్టడిలో 68.2 శాతం సామర్ధం తమ టీకాకు ఉన్నట్టు నిర్ధారించింది. అత్యవసర వినియోగం కోసం గుర్తింపు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారత్ బయోటెక్ ఇదివరకే దరఖాస్తు చేసుకుంది. ఈమేరకు తగిన పత్రాలను సమర్పించింది. ప్రస్తుతం వాటిని విశ్లేషిస్తున్న ప్రపంచ ఆరోగ్యసంస్థ సెప్టెంబర్ లోగా అనుమతి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.