పిల్లల్లో ఇన్ఫెక్షన్ను తట్టుకునే సామర్థం ఎక్కువ
ఐసిఎంఆర్ సెక్రెటరీ బలరామ్ భార్గవ
న్యూఢిల్లీ : కరోనా నేపథ్యంలో పాఠశాలల ప్రారంభంపై ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ కీలక సూచనలు చేశారు. ఒకవేళ స్కూళ్లు తెరవాలని భావిస్తే ముందు ప్రాథమిక పాఠశాలలను తెరిస్తే మంచిదని చెప్పారు. ఇన్ఫెక్షన్ను తట్టుకునే సామర్థం పెద్దలకన్నా చిన్నారులకు ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే టీచర్లందరికి వ్యాక్సినేషన్ పూర్తయితే స్కూళ్లు తెరవొచ్చని ఆయన పేర్కొన్నారు. సెకండరీ పాఠశాలలకంటే ముందు ప్రాథమిక పాఠశాలలను పునఃప్రారంభిస్తే మంచిదనే సంకేతాలను ప్రభుత్వం మంగళవారం అందించింది. అయితే దీనికంటే ముందు పాఠశాలల బస్సు డ్రైవర్లు, ఉపాధ్యాయులు, పాఠశాలలోని ఇతర సిబ్బందికి టీకాలు వేయడం అవసరమని భార్గవ అన్నారు. స్కాండినేవియన్ దేశాల్లో ఇప్పటి వరకు స్కూళ్లను మూసివేయాలేదని, అది కరోనా మొదటి దశ, రెండో దశ, మూడో దశ, ఏ దశ అయినా పాఠశాలలు తెరిచే ఉంచారని ఆయన గుర్తు చేశారు.