Saturday, November 23, 2024

ఈ ఏడాదికి చెరి సగం

- Advertisement -
- Advertisement -

Telangana ENC letter to Krishna Board

కృష్ణ నీటి పంపకంపై కెఆర్‌ఎంబికి ఇఎన్‌సి లేఖ, రాష్ట్రంలో మంచినీటి, సాగునీటి
అవసరాలు చాలా ఉన్నాయ్, ట్రిబ్యునల్ తుదితీర్పు వచ్చేదాక ఇలాగే వాడుకుంటాం
12వబోర్డు మీట్‌లో జరిగింది తాత్కాలిక ఒప్పందమే, క్యాచ్‌మెంట్ ప్రకారం 771టిఎంసిలు రావాలి

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో తాగు.. సాగు నీటి అసరాలు చాలా ఉన్నాయని 2021-22నీటిసంవత్సరానికి గాను కృష్ణానదీ జలాల కేటాయింపుల్లో 50ః50శాతం నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదీయాజమాన్య బోర్డును కోరింది. నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర నీటి అవసరాలకు సంబంధించి కృష్ణారివర్ బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాశారు. బోర్డు 12వ సమావేశంలో తెలంగాణ , ఎపి మధ్య కృష్ణానీటి వినియోగానికి సంబంధించి తాత్కాలిక ఒప్పదం మాత్రమే కుదిరిందని లేఖలో స్పష్టం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఎపికి చేసిన నీటి కేటాయింపులో తెలంగాణకు 34శాతం , ఎపికి 64శాతం నీటిని వినియోగించుకునే విధంగా ఆ ఒక్క సంవత్సరానికి మాత్రమే తాత్కాలిక అగ్రిమెంట్ కుదిరిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానది క్యాచ్‌మెంట్ ఏరియా , సాగుభూముల విస్తీర్ణం పంటల సాగుకు నీటి అవసరాలు , ఈ ప్రాంతంలో ఉన్న జనాభా, కరువు తీవ్రత ఉన్న ప్రాంతాలు తదితర వాటిని పరిగణలోకి తీసుకొని నీటి కేటాయింపులు జరపాల్సివుందన్నారు.

ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి 70.8శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 29.2శాతం నీటికేటాయింపులు చేయాల్సివుందన్నారు. అందుకే కృష్ణానదీజలాల్లో తెలంగాణ రాష్ట్రానికి 771టిఎంసిల నీటని కేటాయించాలని డిమాండ్ చేస్తున్నట్టు వెల్లడించారు. కృష్ణానదీజలాల పంపిణీకి సంబంధించి 1976లో వచ్చిన మొదటి కృష్ణావాటర్ ట్రిబ్యునల్ ఆవార్డును , ఆ తరువాత 2013లో వచ్చిన రెండవ కృష్ణావాటర్ ట్రిబ్యునల్ తీర్పులను రీకాల్ చేయాలని కోరినట్టు లేఖలో వివరించారు. ఏదేమైనప్పటికీ కృష్ణావాటర్ ట్రిబ్యునల్ (పెండింగ్‌లో ఉన్న బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు) ఫైనలైజ్ అయ్యేదాక తెలంగాణ,ఎపి మధ్యన కృష్ణాజలాలను 50ః50శాతం వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు.

ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో కృష్ణానదీ జలాలను రోజుకు 4.7టిఎంసిలు తరలిస్తోందని,అదికూడా కృష్ణాబేసిన్‌కు ఆవల ఉన్న పెన్నా బేసిన్‌కు 300టిఎంసిల నీటిని వాడుతోందని లేఖద్వారా వెల్లడించారు.తెలంగాణ ప్రభుత్వం కృష్టానీటిని రోజుకు 0.28టిఎంసికి మించి వినియోగించుకోలేకపోతోందని తెలిపారు. గత ఏడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నీటికోసం ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలిపారు. కృష్ణానదీజలాల్లో 50శాతం నీటిని వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ కృష్ణాబోర్డు ఛైర్మన్ ఎంపి సింగ్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు లేఖ రాశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News