మహబూబ్ నగర్: కర్నాటకలో భారీ వర్షాలు కురవడం వల్ల ఎగువన ఉన్న ఆల్మట్టి డ్యాం, నారాయణపూర్ డ్యాం నుంచి నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు. దీంతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చే అవకాశం ఉంది. జూరాల ప్రాజెక్టు కు సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలను అప్రమతంగా ఉండాలని, రైతులు నది పక్కన ఉన్న పంట పొలాల లో మోటార్లు ఉంటే తెచ్చుకోగలరని నీటి పారుదల శాఖ అధికారులు సూచించారు. పొలాల దగ్గర ఉన్న పశువులు, మేకలు, గొర్రెల మందాలను రైతులు తమ ఇంటి దగ్గరకి తెచ్చుకొవాలని సూచించారు. మత్య్సకారులు చేపల వేటకు నదిలోకి వెళ్లకూడదన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరో రెండు మూడు రోజులు కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ఎస్.పి. ఆర్.వెంకటేశ్వర్లు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే పొంగుతున్న వాగుల వద్ద పోలీసు అధికారులు తగు హెచ్చరికలను జారీ చేయడంతో దారులను సూచించే గుర్తులు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో పాత ఇండ్లలో ఉన్నవారిని గుర్తించి సురక్షిత ప్రదేశానికి తరలిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని పోలీసు అధికారులకు ఎస్ పి ఆదేశించారు.