దేశవ్యాప్తంగా 147 కేంద్రాలలో
మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా న్యాయవిద్యలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్) 2021 శుక్రవారం(జులై 23) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు క్లాట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజేందర్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 147 పరీక్షా కేంద్రాలలో ఆఫ్‌లైన్ విధానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. కొవిడ్ పరిస్థితుల దృష్టా సాధారణ సీటింగ్ కంటే 50 శాతం కంటే తక్కువగా సీటింగ్‌ను ఏర్పాటు చేశామన్నారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలలో ప్రవేశాలకు మొత్తం 70,277 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో డిగ్రీ కోర్సులకు 59,843 మంది, పిజి కోర్సులకు 10,434 మంది దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకోని అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరుకావచ్చని స్పష్టం చేశారు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు 150 మార్కులకు 150 బహుళ ఐఛ్చిక ప్రశ్నలు ఉంటాయని, అలాగే పిజి కోర్సుల్లో ప్రవేశాలకు 120 మార్కులకు 120 బహుళ ఐఛ్చిక ప్రశ్నలు ఉంటాయని తెలిపారు.