కర్నాటక సెంట్రల్ వర్సిటీ విసిగా బట్టు సత్యనారాయణ
12 సెంట్రల్ వర్సిటీలకు విసిలను నియమించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: దేశంలోని 12 కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు పూర్తిస్థాయి వైస్ చాన్సలర్లను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించారు. ఈ మేరకు సంబంధిత ఫైలుపై ఆయన శుక్రవారం సంతకం చేశారు. కాగా ఈ 12 మందిలో ఇద్దరు తెలుగు వారుండడం విశేషం. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విసిగా డాక్టర్ బసూత్కర్ జగదీశ్వర్ రావు నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం తిరుపతి ఐఐఎస్‌ఇఆర్ డీన్‌గా వ్యవహరిస్తున్నారు. నిజాం కాలేజిలో బిఎస్‌సి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్‌సి, బెంగళూరు ఐఐఎస్‌లో పిహెచ్‌డి పూర్తి చేశారు. అమెరికాలోని యేల్ స్కూల్‌నుంచి బయోలాజికల్ సైన్స్‌లో పోస్టుగ్రాడ్యుయేట్ పట్టా పొందారు. ఈయన అయిదేళ్ల పాటు విసి బాధ్యతల్లో ఉండనున్నారు.
అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్నాటక వైస్ చాన్సలర్‌గా రిటైర్డ్ ప్రొఫెసర్ బట్టు సత్యనారాయణ నియమితులయ్యారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీలో రసాయన శాస్త్ర విభాగాధిపతిగా ఉంటూ రిటైర్ అయ్యారు. దాదాపు 15 ఏళ్ల పాటు ‘ ఔటా’ (ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్) అధ్యక్షుడుగా ఉన్నారు. ఏకంగా మూడుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చదువుకునే రోజుల్లో ఎబివిపి ఆర్ట్ కాలేజి అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ఇద్దరితో పాటుగా మరో 10 సెంట్రల్ యూనివర్సిటీలకు విసిలను నియమించారు. కాగా ఇప్పటికీ ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్‌లాల్ యూనివర్సిటీ సహా మరో పది యూనివర్సిటీలకు పూర్తి స్థాయి వైస్ చాన్సలర్లు లేరు.