న్యూఢిల్లీ / కాబూల్: అఫ్ఘనిస్థాన్‌లోని అక్కడి భారత జాతీయులు అంతా జాగ్రత్తగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. పరిస్థితి బాగా లేదని , ప్రమాదకరంగా మారిందని భారతీయ పౌరులకు అడ్వయిజరీ వెలువరించింది. అమెరికా, నాటో బలగాల నిష్క్రమణలతో తాలిబన్లు పలు ప్రాంతాలనుతిరిగి కైవసం చేసుకుంటున్నారు. పలు కారణాలతో అఫ్ఘన్‌లోని భారతీయులకు చాలా కాలంగా ముప్పు పొంచి ఉంటూ వస్తోంది. అపహరణలు, దాడులు వంటి పరిణామాలకు వీలుంది. కొందరినే ఎంచుకుని తాలిబన్లు మెరుపుదాడులకు, రాదారుల వెంబడి పేలుళ్లకు దిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియనిస్థితి నడుమ భారతీయులు అత్యవసరం అయితే తప్ప బయట తిరగరాదని, ప్రయాణాలకు వెళ్లరాదని సలహాలు వెలువరించారు. పలు ప్రాంతాలలో ఉగ్రవాద బృందాలు హింసాత్మక కార్యకలాపాలకు దిగుతున్నాయి. పౌరులను ఎంచుకుని దాడులకు దిగుతున్నారు. భారతీయులు అత్యవసరంగా బయటకు రావల్సి ఉంటే ఆద్యంతం జాగ్రత్తగా ఉండాలని, పేలుళ్లను దృష్టిలో పెట్టుకుని తగు విధంగా వ్యవహరించాలని తెలిపారు.
Beware of Indians in Afghanistan