సంస్కరణల ఫలాలు అందరికీ సమానంగా అందలేదు
ఈ దిశగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది
2047 నాటికి అమెరికా, చైనాల సరసన భారత్
ఆర్థిక సంస్కరణలపై రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: మూడు దశాబ్దాల ఆర్థిక సంస్కరణల ఫలాలు ప్రజలకు సరి సమానంగా అందలేదని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ అభిప్రాయపడ్డారు. అట్టడుగున ఉన్న పేదలు సంపన్నులవడంపై దృష్టిపెట్టడం కోసం భారతీయ అభివృద్ధి నమూనా అవసరమని అభిప్రాయపడ్డారు. 2047 నాటికి మన దేశం అమెరికా, చైనాలతో సమానంగా ఎదుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణలు అమలులోకి వచ్చి 30 సంవత్సరాలయిన సందర్భంగా అరుదుగా రాసిన వ్యాసంలో ముకేశ్ అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత దేశం 1991లోని కొరతల ఆర్థిక వ్యవస్థ స్థాయినుంచి 2021 నాటికి సమృద్ధ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకొంది. ఇప్పుడు భారత దేశం 2051 నాటికి అందరికీ నిలకడైన, సమృద్ధవంతమైన, సమానమైన సుఖసంతోషాలనిచ్చే ఆర్థిక వ్యవస్థగా ఎదగాల్సి ఉంది. సమానత్వం అనేది మన ఉమ్మడి ఎదుగుదల ముఖ్యాంశంగా ఉండాలి’ అని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రికలో రాసిన ఆ వ్యాసంలో ముకేశ్ అంబానీ అన్నారు.
1991లో దేశ ఆర్థిక వ్యవస్థ దిశను, నిర్ణయాలను మార్చడంలో భారత్ ముందుచూపును, ధైర్యాన్ని ప్రదర్శించిందని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో భారత ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ రంగానిదే అగ్రస్థానంగా ఉండింది. అయితే, ప్రభుత్వం ప్రైవేటు రంగాన్ని కూడా అత్యున్నత స్థానంలో నిలిపింది. అంతేకాకుండా లైసెన్స్ రాజ్‌కు ముగింపు పలికింది. వాణిజ్య, పరిశ్రమల విధానాలను సరళీకరించింది, పెట్టుబడుల మార్కెట్‌ను ఆర్థిక రంగాన్ని సరళీకరించింది. ఈ సంస్కరణలు పారిశ్రామిక శక్తిని సరళీకరించడంతో పాటుగా శరవేగంతో కూడిన అభివృద్ధికి నాంది పలికింది’ అని అన్నారు. దేశ జనాభా 88 కోట్ల నుంచి 138 కోట్లకు పెరిగినప్పటికీ ఈ సంస్కరణలు భారత దేశం అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి దోహదపడ్డాయని అన్నారు. కీలకమైన మౌలిక సదుపాయాలు గుర్తించడానికి వీలులేనంతగా మార్పు చెందాయి. మన హైవేలు, విమానాశ్రయాలు, రేవులు ఇప్పడు ప్రపంచస్థాయివిగా ఉన్నాయి. అలాగే, పరిశ్రమలు, సేవలు కూడా ప్రపంచస్థాయిలో ఉన్నాయి అని ముకేశ్ పేర్కొన్నారు.
India can become rich country by 2047: Mukesh Ambani