భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
రాష్ట్రాన్ని అలర్ట్ చేసిన కేంద్ర జలవనరుల సంఘం
కృష్ణకు వరదలు, జూరాల ప్రాజెక్టుకు 3.33లక్షల క్యూసెక్కుల నీరు రాక
శ్రీశైలానికి భారీగా పెరిగిన ప్రవాహాలు
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర జలవనరుల సంఘం తెలగాణ రాష్ట్రానికి గోదావరిలో భారీ వరదలకు సంబంధించిన హెచ్చరికలు చేస్తూ అధికారులను అప్రమత్తం చేసింది. భద్రాచలం వద్ద ఉదయం పదిగంటలకు నదిలో నీటిమట్టం 43అడుగులకు చేరటంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీచేసిన అధికారులు సాయంత్రం ఆరు గంటలకు నదీలో నీటిమట్టం 48అడుగులకు పెరగటంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుపాకులు గూడెం వద్దగోదావరి సమ్మక్క సాగరం నుంచి 14లక్షల క్యూసెక్కుల వరదప్రవాహం దిగువకు విడుదలవుంతోంది. ఒక్కరోజులోనే సుమారు 130టిఎంసిల వరద ప్రవాహం గోదావరి నుంచి దిగువకు జారుకుంటున్నట్టు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. రామన్న గూడెం వద్ద పుష్కర ఘాట్‌లో వరద ప్రవాహం పెరగటంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకం పంపులను నిలిపివేశారు. చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టు నుంచి 15గేట్లు ఎత్తి 18,176క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువనుంచి శ్రీరాం సాగర్ ప్రాజెక్టులోకి 75980క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా, 57 980క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దిగువన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 2,18,698 క్యూసెక్కుల నీరు చేరుతుండగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి అంతే నీటిని విడుదల చేస్తున్నారు. కడెం ప్రాజెక్టులోకి 8147క్యూసెక్కులు చేరుతుండగా, 147క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిడ్ మానేరులోకి 6670క్యూసెక్కులు, లోయర్ మానేరులోకి 1035క్యూసెక్కుల నీరు చేరుతోంది. మంజీరా నదిలో నీటి ప్రవాహకం పెరిగింది. సింగూరు ప్రాజెక్టలోకి 4175క్యూసెక్కుల నీరు చేరుతుండగా ప్రాజెక్టులో నీటినిలువ 68శాతంకు పెరిగింది. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 2700క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టులో నీటినిలువ 55శాతానికి చేరింది.
జలవేణిగా మారిన కృష్ణవేణి
మహారాష్ట్ర నుంచి వస్తున్న భారీ వరదలకుతోడు, కర్ణాటకలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానది పరివాహకంగా ఉన్న దాని ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తర కర్ణాటకలోని కృష్ణ, వేదగంగా, దూద్‌గంగ, హిరణ్యవేణి, మార్కెండేయ, అఘనాశిని, గంగావతి, తుంగ, భద్ర తదితర నదులు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో కృష్ణానదిలో వరద ఉధృతి అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. ఎగువనుంచి ఆల్మట్టి జలాశయంలోకి 2,56,944క్యూసెక్కుల నీరు చేరుతుండగా, జలాశయం నుంచి 3,50,000క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌లో పూర్తి స్థాయి నీటినిలువ సామర్ధం 129టిఎంసిలుకాగా, ప్రస్తుతం 82టిఎంసిల నీటిని నిలువ చేశారు.దిగువన నారాయణపూర్ జలాశయంలోకి 3.30లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, జలాశయం నుంచి 3,41,800క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాలకు 3.33లక్షల వరద
కృష్ణానదిలో ఎగువనుంచి జూరాల ప్రాజెక్టులోకి 3.33లక్షల క్యూసెక్కుల వదర నీరు చేరుతోంది. ప్రాజెక్టు 32గేట్లు తెరిచి 3,41,800క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇటు కృష్ణానది నుంచి అటు తుంగభధ్ర నుంచి వరద ప్రవాహం భారీగా పెరిగింది. ప్రాజెక్టులోకి 3,70,817క్యూసెక్కుల నీరు చేరుతుండగా, జలాశయం నుంచి 25427 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో నీటిమట్టం 855.60అడుగులకు చేరుకుంది. జలాశయంలో నీటినిలువ 93.58టిఎంసిలకు పెరిగింది. దిగువన నాగార్జున సాగర్‌లో ప్రాజెక్టులోకి 29305క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ప్రాజెక్టులో నీటి మట్టం 537అడుగులకు చేరింది. జలాశయంలో నీటినిలువ 182.13టిఎంసిలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. పులిచింతల జలాశయంలోకి 13800క్యూసెక్కుల నీరు చేరుతుండగా గేట్లు తెరిచి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువన ప్రకాశం బ్యారేజికి వదిలిపెడుతున్నారు. మూసినదిలో కూడా వరద స్వల్పంగా పెరిగింది. మూసి ప్రాజెక్టులోకి ఎగువనుంచి 8500 క్యూసెక్కుల నీరు చేరుతుండగా గేట్లు తెరిచి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నేడు తుంగభద్ర గేట్లు ఎత్తివేత:
ఎగువన తుంగ, భద్ర ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో నిండిపోవటంతో తుంగభద్ర జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులకు గాను ఇప్పటికే 1625.52 అగుడులకు చేరుకుంది. ఎగువనుంచి 1,16,817 క్యూసెక్కుల వరదనీరు చేరుకుంటోంది. కర్ణాటక రాష్ట్ర కాలువలకు సాగునీటి కింద 6823క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయంలో నీటినిలు 74శాతానికి చేరటంతో ఎగువనుంచి వస్తున్న వరదనీటిని దృష్టిలో పెట్టుకుని ఆదివారం ఉదయానికి తుంగభద్ర జలాశయం పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు.
దిగువ ప్రాంతాల్లో వరద హెచ్చరిక
తుంగభద్ర ప్రాజెక్టు గేట్లను ఆదివారం ఎత్తివేయనున్నట్టు తుంగభద్ర ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టు దిగువన కర్ణాటక, తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లోని అధికారులకు వరద హెచ్చరికలతో సమాచారం అందచేశారు. తుంగభద్ర నదికి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ఇప్పటికే తుంగభద్ర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
Flood Warning at Bhadrachalam due to Heavy Rains