Tuesday, September 24, 2024

దళితబంధుపై నేడు సిఎం దిశానిర్దేశం

- Advertisement -
- Advertisement -

CMKCR Review on Dalitbandhu Scheme Tomorrow

ప్రగతిభవన్‌లో తొలి అవగాహన సదస్సు

హుజురాబాద్ నియోజక వర్గంలో ఫైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం
గ్రామానికి నలుగురు, మున్సిపాలిటీ ఒక్కో వార్డు నుంచి నలుగురికి ఆహ్వానం
మొత్తం 412మందితో పాటు 15మంది రిసోర్స్‌పర్సన్‌తో సుదీర్ఘ సమావేశం

హైదరాబాద్: హుజూరాబాద్ నియోజక వర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం కానున్న, దళిత బంధు పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణతో పాటు విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై తొట్టతొలి అవగాహన సదస్సును ప్రగతిభవన్‌లో సోమవారం నాడు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరుగనుంది. ఈక్రమంలో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం వరకు జరగనున్న ఈ సమావేశంలో హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు), ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున (ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు) మొత్తం 412 మంది దళిత పురుషులు మహిళలు పాల్గొననున్నారు.

వారితో పాటు 15 మంది రిసోర్సు పర్సన్స్ పాల్గొంటారు. మొత్తం 427 మంది హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన దళితులు ఈ అవగాహన సదస్సులో పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా ఈ సదస్సు గురించి సిఎం కెసిఆర్ వివరిస్తూ ‘సోమవారం (జూలై 26 న)హుజూరాబాద్ నియోజకవర్గం పరిథిలోని గ్రామాల నుంచి వారి వారి మండల కేంద్రాలకు ఉదయం 7 గంటలకు చేరుకుంటారు. మండల కేంద్రంలో అల్పాహార కార్యక్రమం ముగించుకుని అక్కడ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో హుజూరాబాద్ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైదరాబాద్ కు మొత్తం 427 మంది పలు బస్సుల్లో బయలు దేరుతారు. ఉదయం 11 గంటల వరకు హైదరాబాద్ ప్రగతి భవన్ కు చేరుకుంటారని సిఎం తెలిపారు.

ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగే సదస్సులో దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశ్యం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ తో పాటు పథకాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద వారికి అవగాహన కల్పిస్తారు. ఫైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ లో ప్రారంభం కానున్న దళితబంధు పథకం, రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకు ఏవిధంగా దోహదపడుతుంది., పైలట్ ప్రాజెక్టును హుజూరాబాద్ లో చేపట్టిన నేపథ్యంలో చారిత్రాత్మక పథకంలో ఆ ప్రాంత బిడ్డలుగా ఎట్లా లీనమై పనిచేయాలె, దళితుల సామాజిక ఆర్థిక గౌరవాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న తెలంగాణ దళిత బంధు పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలు ఏమిటి ? సిఎం కెసిఆర్ మానస పుత్రికయిన ఈ పథకాన్ని ఎట్లా దళితుల్లోకి తీసుకపోవాలె ? వారి జీవితాలను వారే అభివృద్ధి చేసుకునే దిశగా ఎట్లా వారికి అవగాహన కల్పించాలె ? అధికారులతో ఎట్లా సమన్వయం చేసుకోవాలె, కలిసి పోవాలె ? అనే తదితర అంశాలను ఇంటరాక్షన్ సెషన్ లో హాజరైన వారికి సిఎం కెసిఆర్ వివరించి అవగాహన కల్పిస్తారు. మధ్యాహ్నం లంచ్ కార్యక్రమం ఉంటుందని, ఆ తర్వాత కొనసాగిన అవగాహన సదస్సు సాయంత్రానికి ముగుస్తుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

CMKCR Review on Dalit Bandhu Scheme Tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News