Monday, November 25, 2024

డెల్టా రోగి నుంచి వెయ్యి రెట్లు ఎక్కువగా సంక్రమించే వైరస్

- Advertisement -
- Advertisement -

Virus is transmitted thousand times more from Delta patient

బాధితుడి దగ్గరకు వెళ్లిన 4 రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్

కెన్సింగ్టన్ : కరోనా వేరియంట్లన్నిటిలో ఎక్కువగా సంక్రమించే శక్తి కలిగిన డెల్టా వేరియంట్ ను కట్టడి చేయడానికి ముమ్మర చర్యలు అవసరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వేరియంట్ బారిన పడిన వారికి దగ్గరగా వెళ్లిన వారిని ప్రారంభదశ లోనే గుర్తించడానికి వ్యవధి తక్కువగా ఉంటోందని పేర్కొన్నారు. కరోనా టీకాలు ప్రజలందరికీ అందుబాటు లోకి రాని నేపథ్యంలో ఈ రకం ఉధృతికి కళ్లెం వేయాలంటే ఇలాంటి వారిని వేగంగా గుర్తించడం అవసరమని చెబుతున్నారు. 2019 లోచైనా లోని వుహాన్‌లో కరోనా బయటపడిన తరువాత, గత ఏడాది మార్చిలో మరింత సాంక్రమిక శక్తి కలిగిన డి 614 జి రకం వచ్చింది. తరువాత బ్రిటన్ లో అల్ఫారకం బయటపడింది.

2021 ప్రారంభంలో దీని వ్యాప్తి ప్రపంచమంతటా కనిపించింది. ఈలోగా డెల్టా వేరియంట్ పుట్టుకొచ్చింది. కొన్ని మార్పుల వల్ల అల్ఫా కన్నా దీని వ్యాప్తి ఎక్కువైంది. వుహాన్ రకంతో పోలిస్తే డెల్టా వేరియంట్ సోకిన వ్యక్తి నుంచి వెయ్యి రెట్లు ఎక్కువగా వైరస్ వెలువడుతున్నట్టు ఒక అధ్యయనంలో తేలింది. డెల్టా వల్ల ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం, ఐసియులో చికిత్స పొందాల్సి రావడం, మరణం ముప్పు ఇవన్నీ రెట్టింపు స్థాయిలో ఉంటాయని మరో పరిశోధన వెల్లడించింది. గత ఏడాది కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గరకు వెళ్లినప్పటి నుంచి ఇన్‌ఫెక్షన్ బారిన పడడానిక మధ్య సరాసరిన ఆరు రోజులు వ్యవధి ఉండేది. డెల్టా వేరియంట్ విషయంలో ఇది నాలుగు రోజులకు పడిపోయింది. దీంతో ఇన్‌ఫెక్షన్ సోకడానికి ముందే వారిని గుర్తించడం మరింత కష్టమవుతోందని శాస్త్రవేత్తలు చెప్పారు. తాము గుర్తించేటప్పటికే

బాధితుడిగా దగ్గరగా వచ్చిన వారిలో వంద శాతం మంది ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నారని ఆస్ట్రేలియా లోని న్యూసౌత్ వేల్స్ అధికారులు తెలిపారు. గత ఏడాది ఇది 30 శాతం మాత్రమే ఉండేదని చెప్పారు. బాధితుడి దగ్గరగా వెళ్లిన వ్యక్తి నుంచి 24 గంటల్లోనే వైరస్ వ్యాప్తి మొదలవుతున్న ఉదంతాలు దక్షిణ ఆస్ట్రేలియా లో వెలుగు చూశాయన్నారు. 60 శాతానికి పైగా జనాభా టీకా పొందిన ఇజ్రాయెల్ వంటి దేశాల్లో డెల్టా విజృంభిస్తున్నప్పటికీ ఆస్పత్రి పాలు కావడం, మరణం ముప్పు వంటి వాటి నుంచి చాలా వరకు రక్షణ లభిస్తున్నట్టు నిపుణులు తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల తయారీ సామర్ధం పెంపునకు చర్యలు చేపట్టడంతోపాటు డెల్టా, ఎప్సిలాన్ వంటి వేరియంట్లను ఎదుర్కొనే బూస్టర్ టీకాలకు ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వాలకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ చర్యలు సత్వరం చేపట్టకుంటే మళ్లీ వచ్చే ఏడాది కూడా లాక్‌డౌన్లు విధించాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాక్సిన్ల కోసం నిరీక్షణ మళ్లీ పెరుగుతుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News