Friday, November 22, 2024

నాలుగుసార్లు సిఎం కానీ..

- Advertisement -
- Advertisement -

Yediyurappa has been CM of Karnataka state four times

 

ప్రతిసారి అర్థాంతర అధికారం
ఓ దశలో మూడురోజుల సర్కారుగిరీ
కర్నాటకలో కమల ప్రభకు అప్ప

బెంగళూరు : కర్నాటకలో బిజెపిని అడుగుపెట్టేలా చేసి, బలోపేతం దిశలో శ్రేణులు కదిపిన యడ్యూరప్ప రాష్ట్రానికి నాలుగుసార్లు సిఎం అయ్యారు. రాష్ట్ర రాజకీయాలలో ఇదో ఘనత వహించిన అంశం అని యడ్యూరప్పనే చెప్పారు. అయితే ఆయన నాలుగుసార్ల పదవీకాలంలో ఎప్పుడూ పూర్తి కాలం అంటే ఐదేళ్ల పాటు పదవిలో లేరు. కేవలం మూడు రోజులు, ఏడురోజుల వరకూ పదవిలో కొనసాగి వైదొలిగిన చెత్త రికార్డు కూడా ఆయన ఖాతాలో ఉంది. ఈసారి సరిగ్గా రెండేళ్లు అధికారంలో ఉండి పదవి నుంచి అధిష్టానం ప్రోద్బలంతోనే వైదొలగాల్సి వచ్చిన యడ్యూరప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా వెనకకు వెళ్లబోరని వెల్లడైంది. ఆయన రాజకీయ జీవితంలో అత్యున్నత శిఖరాలు, పతనపు టంచులు అనేకం ఉన్నాయి. యడ్యూరప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2007 నవంబర్‌లో తొలిసారి బాధ్యతలు తీసుకున్నప్పుడు కేవలం ఏడు రోజులే పదవిలో ఉన్నారు. తరువాత 2008లో మూడేళ్ల రెండు నెలలు ఉన్నారు.

ఇక మూడో పర్యాయం 2018లో ముచ్చటగా మూడు రోజులే అధికారంలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు నాలుగో పర్యాయం ఆయన పదవిలోకి 2019 జులై 26న వచ్చారు. రెండేళ్లకు ఇప్పుడు వైదొలిగారు. బిజెపిని ఎప్పుడూ తిరిగి అధికారంలోకి తెప్పించే వ్యక్తిగా యడ్యూరప్పకు పేరుంది. వింధ్యపర్వతాలకు ఈవల దక్షిణాదిలోని అత్యంత వనరులతో కూడిన కర్నాటకలో , అదీ కాంగ్రెస్ ప్రాభవపు మూలాల రాష్ట్రంలో కమలాన్ని వికసింపచేసిన లోతైన కార్యాచరణ ఆయనకు సొంతం. కాలానుగుణపు పరుగులతో ముందుకు దూసుకువెళ్లే పందెపు గుర్రంగా ఆయన స్థానం దక్కించుకున్నారు. పలు క్లిష్ట సమస్యలతో నాలుగుసార్లు పూర్తి స్థాయిలో అధికారంలో ఉండలేని నేతగా ఆయన మారారు. రాజకీయ సుడిగుండాలకు ఎదురీదుతూ వెళ్లడం ఆయనకు చేతనవును. రాజకీయాలలో ఆయన ఎంచుకున్న పద్దతి ఒక్కటే ప్రజలతో ఎప్పుడూ మమేకం అయి ఉండటం. ఈ విధంగా ఆయనకు 24/7 రాజకీయ నాయకుడు అనే ఖ్యాతి దక్కింది. అభిమానులు ఆయనను రాజ హులి ( రాచపులి) అంటుంటారు. బిఎ వరకూ చదివిన యడ్యూరప్ప ఎమర్జెన్సీ సమయంలో జైలు పాలయ్యారు.

కొంత కాలం సోషల్ వెల్ఫేర్ విభాగంలో క్లర్క్ ఉద్యోగం చేశారు. తరువాత శికారిపురలో ఓ రైస్‌మిల్లులో క్లర్క్‌గా ఉన్నారు. తరువాత షిమోగలో హార్డ్‌వేర్ దుకాణం నడిపించారు. రైస్‌మిల్లులో పనిచేస్తున్నప్పుడే మిల్లు యజమాని కూతురు మైత్రీదేవిని పెళ్లాడారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు బి వై రాఘవేంద్ర షివమొగ్గ నుంచి లోక్‌సభ సభ్యులుగా ఉన్నారు. 1943 ఫిబ్రవరి 27న మాండ్య జిల్లాలోని బూకనకెరేలో జన్మించిన యడ్యూరప్ప కరడుగట్టిన ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్‌గా పేరొందారు. ఇప్పుడు సిఎంగా ఆయన వైదొలిగినా ఇది తాత్కాలిక పరిణామమే అని, ఆయనకు ఇప్పటికిప్పుడు రాజకీయ సన్యాసం లేదా తెరవెనకకు వెళ్లడం ఉండదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

దక్షిణాదిలో తొలి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో యడ్యూరప్ప వ్యూహరచన కీలకమైనది, ఎప్పుడూ పేలవంగా అరుదుగా నవ్వే ముఖంతో ఉండే యడ్యూరప్ప ప్రజాభిష్టాలకు అనుగుణంగా స్పందిస్తూ రావడంతో మనసెరిగిన నేతగా గుర్తింపు పొందారు. యువనాయకత్వానికి ఇప్పుడు అవకాశం ఇవ్వడం ద్వారా వచ్చే రెండేళ్ల తరువాత కర్నాటకలో తిరిగి బిజెపి ప్రభుత్వం కొనసాగేలా చేసేందుకు పార్టీ వ్యూహం పన్నింది. ఈ దశలో యడ్యూరప్ప నిష్క్రమణకు అధిష్టానం ఎక్కువ సమయం తీసుకోవల్సి వచ్చింది. ఈ విధంగా ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు భారీ స్థాయిలోనే ఆయనతో లోపాయికారి అవగావహన కుదిరి ఉంటుందని భావిస్తున్నారు. కర్నాటకలో బిజెపి బలోపేతం దిశలో ఆయన మరింత కీలక పాత్రతోనే సాగుతారని స్పష్టం అయింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News