హబుల్ డేటా ఆధారంగా ప్రథమంగా కనుగొన్న స్వీడన్ పరిశోధకులు
వాషింగ్టన్ : బృహస్పతి చంద్రుడు ‘గనిమెడె’ వాతావరణం లో నీటి ఆవిరి ఆనవాళ్లను మొట్టమొదటిసారి ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొనగలిగారు. స్వీడన్ లోని స్టాక్‌హోమ్‌కు చెందిన కెటిహెచ్ రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు లోరెంజ్ రోత్ నాయకత్వంలో ఈ పరిశోధన జరిగింది. నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ నుంచి లభించిన నవీన, ప్రాచీన భౌగోళిక డేటా ఆదారంగా శాస్త్రవేత్తలు నిర్వహించిన ఈ అధ్యయనం సోమవారం జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో వెల్లడైంది. బృహస్పతి చంద్రుని ఉపరితలం పైని మంచు గడ్డలు ఘనస్థితి నుంచి వాయువుగా మారినప్పుడు ఈ ఆవిరి ఏర్పడుతుందని గుర్తించారు. సౌరవ్యవస్థలో అతిపెద్ద చంద్రుడు ‘గనిమెడె’ భూమిపై ఉన్న సముద్రాలన్నిటికన్నా భారీ ఎత్తున నీటితో నిండి ఉంటుందని నాసా ఇదివరకటి అధ్యయనంలో వెల్లడించింది.
అయితే అక్కడ ఉష్ణోగ్రతలు అతి శీతలంగా ఉండడంతో బృహస్పతి చంద్రుని ఉపరితలంపైని నీరంతా గడ్డకట్టి ఉంటుందని పేర్కొంది. ఉపరితలానికి దాదాపు 160 కిమీ లోతున గనిమెడె సముద్రం ఉంటున్నందున నీటి ఆవిరి సముద్రం ఆవిరి అని చెప్పడానికి వీలుండదని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ నీటి ఆవిరిని కనుగొనడానికి దాదాపు రెండు దశాబ్దాల పాటు హబుల్ పరిశోధనలను మళ్లీ విశ్లేషించారు. గనిమెడె అతినీల లోహిత దృశ్యాలను 1998 లో మొదట హబుల్ స్పేస్ టెలిస్కోపు ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్ చిత్రీకరించ గలిగింది. అయినీకరణ అయిన వాయువు రంగురంగుల చారలను బయటపెట్ట గలిగింది. ఈ చారలను అరోరల్ పట్టీలు అంటారు. అంతేకాక ఈ గనిమెడె (బృహస్పతి చంద్రుడు ) కి బలహీనమైన అయస్కాంత క్షేత్రం ఉందని కనుగొన గలిగారు. ఈ గనిమెడె వాతావరణంలో అణు ఆక్సిజన్ సాంద్రతల తేడాను గుర్తించారు. పగటి పూట ఈ చంద్రుని ఉపరితల ఉష్ణోగ్రతలు విభిన్నంగా ఉంటాయని, మధ్యాహ్నం వేళ భూమధ్య రేఖకు సమీపాన చాలా వేడిగా ఉంటుందని ఫలితంగా ముచు ఉపరితలం నుంచి కొన్ని చిన్నపాటి నీటి రేణువులు విడుదల అవుతుంటాయని గుర్తించారు.