పతకానికి అడుగు దూరంలో భారత్!
టోక్యో: ఒలింపిక్స్ మహిళల బాక్సింగ్‌లో భారత యువ సంచలనం లవ్లీనా బొర్గొహైన్ (69 కిలోల) విభాగంలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. భారీ ఆశలతో టోక్యో క్రీడల బరిలోకి దిగిన లవ్లీనా ప్రిక్వార్టర్ ఫైనల్లో జర్మనీ బాక్సర్ నడైన్ ఆప్టెజ్‌ను ఓడించింది. హోరాహోరీ పోరులో లవ్లీనా 32 తేడాతో సంచలన విజయం సాధించింది. అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే లవ్లీనా అసాధారణ ఆటతో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుని పెను ప్రకంపనలు సృష్టించింది. అంతేగాక ఒలింపిక్స్‌లో పతకానికి ఒక గెలుపు దూరంలో నిలిచింది. మంగళవారం జరిగిన పోరులో లవ్లీనా అద్భుత ఆటను కనబరిచింది. హోరాహోరీ సమరంలో ప్రత్యర్థిని కంగుతినిపించి పతకం ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు లవ్లీనా ప్రత్యర్థి నడైన్ కూడా అద్భుత పోరాట పటిమను కనబరిచింది. జర్మనీ నుంచి బాక్సింగ్ బరిలో దిగిన ఏకైన బాక్సర్ నడైన్ మాత్రమే. ఆమె కూడా తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అయితే హోరాహోరీ పోరులో భారత బాక్సర్ చేతిలో పోరాడి ఓడింది. ఇక భారత్‌కు చెందిన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. ఈసారి మేరీకోమ్ స్వర్ణంపై కన్నేసింది.