రాజ్యసభలో కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడి
న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన లడక్, కశ్మీర్‌లను మళ్లీ కలిపి రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రకటించింది. సాధారణ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఆ ప్రకటన విడుదల చేస్తామని తెలియచేసింది. శివసేన ఎంపి ప్రియాంక చతుర్వేది అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో బుధవారం హోం శాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న 370,35 ఎ అధికరణలను 2019 ఆగస్టు 5 న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. జమ్ముకశ్మీర్, లడక్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది. బిజెపి ఎంపి సస్మిత్ పాత్ర జమ్ముకశ్మీర్‌లో భద్రతా చర్యలపై ప్రశ్న వేశారు. దీనికి సమాధానం ఇస్తూ ఉగ్రవాదుల దాడులు తగ్గుముఖం పట్టాయని వివరించారు. 2020 లో 50 శాతం ఉంటే , 2021 జూన్ నాటికి 32 శాతానికి తగ్గిందని వివరించారు. ఉగ్రవాద నిరోధానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపై నిరంతర నిఘా పెట్టినట్టు చెప్పారు. లోయలో కశ్మీర్ పండితుల పునరావాసం, భద్రతపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కశ్మీర్‌లో 900 కశ్మీర్ పండిత్, డోగ్రా హిందూ కుటుంబాలు ఉన్నాయని వివరించారు.