రాజంపేట: ఆమె ఒక గ్రామ ప్రథమ పౌరురాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి 50% రిజర్వేషన్ ప్రకారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. కొన్ని రోజులు బాగానే ఉన్నప్పటికీ ఆమె భర్త శ్రీనివాస్ ఆకస్మికంగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరుసటి రోజు నుండి ఆమెకు బాధలు ఎదురయ్యాయి. ఆ బాధలను గ్రామ సమస్యలను ఎదుర్కునేందుకు తనవంతు కృషి చేస్తున్న సమయంలో గ్రామంలోని కొంత మందితో పాటు కుటుంబ సభ్యులు ఆమెకు తోడు ఉండాల్సిన వారే ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండ గ్రామ సర్పంచ్ లక్ష్మీశ్రీనివాస్‌పైన దాడి జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఇంకా కొందరు వ్యక్తులు ఆమెపై దాడి చేసి నట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
తన భర్త కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని మరుసటి రోజు నుండి తన కుటుంబ సభ్యులు గ్రామస్తులు తనను ఆవేదనకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు. సర్పంచ్ ఆస్తులను తమకు పంచాలని సర్పంచ్ భర్త తమ్ముడు,కొంత మంది కలిసి మానసిక ఇబ్బందితో పాటు దాడులు చేస్తున్నారని తెలిపారు. తాజాగా మంగళవారం మధ్యాహ్నం తనపై దాడి చేశారని ఆమె పోలీస్ స్టేషన్‌లో సైతం ఫిర్యాదు చేసింది. ఆస్తి కోసం తనను అనేక చిత్రహింసలు పెడుతున్నారని తనకు న్యాయం చేయాలని తన కొడుకును సైతం వేధింపులకు గురి చేస్తున్నారని కుమారుడు ఎదురు తిరిగితే చంపేస్తామంటూ బెదిరించడంతో తన తల్లిగారింటికి పంపించాలని అన్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ కంటతడి పెట్టుకున్నారు. ఇదే విషయంపై స్థానిక ఎస్సై సతీష్ కుమార్‌ను సెల్ ఫోన్ లో వివరణ కోరగా గ్రామస్తులు ఎవరు దాడి చేయలేదని కుటుంబంలో ఉన్న ఆస్తి తగాదాల విషయమే గొడవలు జరిగాయని అయితే ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఇరువురు ఫిర్యాదు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.