Saturday, November 23, 2024

రెండో టి20లో లంక గెలుపు

- Advertisement -
- Advertisement -

రెండో టి20లో లంక గెలుపు

సిరీస్ సమం, నేడు ఆఖరి పోరు

కొలంబో: భారత్‌తో జరిగిన రెండో ట్వంటీ20లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో లంక సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ గురువారం జరుగనుంది. ఇందులో గెలిచే జట్టుకు సిరీస్ దక్కుతుంది. ఇక కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక అదరగొట్టింది. టీమిండియా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కావడం కూడా లంకకు కలిసి వచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లంక మరో రెండు బంతులు మిగిలివుండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ మినోద్ భానుకా అద్భుతంగా ఆడాడు. 4 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. ఇక, ధనంజయ డిసిల్వా తన మార్క్ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. ఒక దశలో భారత్ గెలుపు ఖాయంగా కనిపించింది. కానీ ధనంజయ డిసిల్వా అసాధారణ పోరాట పటిమతో లంకకు విజయం అందించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన ధనంజయ ఒక ఫోర్, సిక్స్‌తో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చామికా కరుణరత్నె 12 (నాటౌట్) అతనికి అండగా నిలిచాడు.
శుభారంభం
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కు ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. అరంగేట్రం మ్యాచ్‌ను ఆడిన రుతురాజ్ లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. కెప్టెన్ ధావన్ కూడా దూకుడును ప్రదర్శించాడు. అయితే 18 బంతుల్లో ఒక ఫోర్‌తో 21 పరుగులు చేసిన రుతురాజ్‌ను శనక వెనక్కి పంపాడు. దీంతో 49 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన ధావన్ ఐదు ఫోర్లతో 40 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక, మరో అరంగేట్రం ఆటగాడు దేవ్‌దుత్ పడిక్కల్ కూడా మెరుగైన ప్రదర్శన చేశాడు. లంక బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న పడిక్కల్ 23 బంతుల్లో ఒక ఫోర్, సిక్స్‌తో 29 పరుగులు సాధించి ఔటయ్యాడు. మిగతావారు పెద్దగా రాణించలేదు. లంక బౌలర్లు కచ్చితమైన లైన్ అండ్ లెన్త్‌తో బౌలింగ్ చేసి భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడంలో సఫలమయ్యారు. దీంతో టీమిండియా స్కోరు 132 పరుగులకే పరిమితమైంది. లంక బౌలర్లలో నచమీరా, కరుణరత్నె మెరుగైన బౌలింగ్‌ను కనబరిచారు.
నలుగురు అరంగేట్రం
ఈ మ్యాచ్‌లో టీమిండియా తరఫున నలుగురు కొత్త ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్య కరోనా బారిన పడడంతో అతనితో సన్నిహితంగా మెలిగిన క్రికెటర్లు ఈ మ్యాచ్‌కు దూరమయ్యారు. సూర్యకుమార్, పృథ్వీషా, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, దీపక్ చాహర్ తదితరులు మ్యాచ్‌కు అందుబాటులో లేకుండాపోయారు. దీంతో వీరి స్థానంలో నలుగురు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, దేవ్‌దుత్ పడిక్కల్, నితీష్ రాణా, చేతన్ సకారియా ఈ మ్యాచ్ ద్వారా ట్వంటీ20 అంతర్జాతీయ కెరీర్‌కు శ్రీకారం చుట్టారు.

IND vs SL 2nd T20: SL win by 4 Wickets against Ind

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News