ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది
మహిళలు పారిశ్రామిక వేత్తలుగా రాణించడానికి తగిన సహకారం అందిస్తుంది
వి హబ్ గ్రాడ్యుయేషన్ ఉత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న సందర్భంలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్: నూతన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ వ్యాఖాంచారు. ప్రధానంగా మహిళలు పారిశ్రామిక వేత్తలుగా రాణించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదన్నారు. వారికి ప్రభుత్వ పక్షాన అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం గత ఏడు సంవత్సరాలలోనే పారిశ్రామిక రంగంలో గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా మారిందన్నారు. పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కల్సిస్తున్న సౌకర్యాలు, రాయితీలు చాలా గొప్పగా ఉన్నాయన్నారు. అందువల్లే ప్రపంచంలోని అగ్రశేణి కంపెనీలన్నీ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన వి-హబ్ గ్రాడ్యుయేషన్ ఉత్సవ కార్యక్రమానికి మంత్రి కెటిఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు స్టార్టప్ సంస్థలతో వ్యక్తిగతంగా ఆయన ఇంటరాక్ట్ అయ్యారు.
వి-హబ్ నుంచి సభ్య త్వం పొంది గ్రాడ్యుయేట్ పూర్తిచేసుకున్న 47 స్టార్టప్‌లకు మంత్రి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే వారి వ్యాపార ఆలోచనలకు ప్రభుత్వం తరుఫున సహకారం అందిస్తామన్నారు. మంచి ఆ లోచనలుంటే తప్పకుండా ప్రోత్సహించడమే కాకుండా సరైన మార్కెటింగ్ కు అవకాశాలు కల్పిస్తామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రొత్సహించడానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వి-హబ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. మహిళా నేతృత్వంలోని యునికార్న్ భారతదేశం నుండి వస్తుందని తాను ఆశిస్తున్నానని మంత్రి కెటిఆర్ అన్నారు. ఇది తెలంగాణలోని వి-హబ్ నుంచే వస్తుందన్న విశ్వాసం తనుకుందన్నారు. భారత్ అత్యంత యువ దేశమన్నారు. దేశంలో 65 శాతం యువత 30 నుంచి 35లోపే ఉన్నారన్నారు. వారిపైనే దేశ భవిష్యత్తు ఆదారపడి ఉందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలో సుమారు 1.3 బిలియన్ యువత ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకునే యువ పారిశ్రామిక వేత్తలకను ప్రొత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. పెట్టుబడులకు తెలంగాణను స్వర్గధామంగా మలచడం వల్లే ప్రస్తుతం పెట్టుబడులకు ఎన్నో కంపెనీలు ముందుకొస్తు న్నాయన్నారు. వ్యాపార నిర్వహణ కోసం ప్రభుత్వం అవసరమైన వాతావరణాన్ని సృష్టించామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని ఇన్నోవేషన్స్ చేయాలన్నారు. మనం కనిపెట్టినవి మన దేశానికే కాకుండా ప్రపంచానికి ఉపయోగపడతాయన్నారు. చాలా మంది ఔత్సాహిక మహిళలు మంచి ఆలోచనలు కలిగి ఉన్నారని ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు. సమకాలీన సమస్యలు, సవాళ్లకు పలు స్టార్టప్‌ల ఆలోచనలు, పరిష్కారాలు తననెంతో అబ్బుర పరిచాయన్నారు. యువ మహిళా పారిశ్రామికవేత్తలు పంచుకున్న కొన్ని ఐడియాలు, ఉత్పత్తులు, ప్రపంచ గతి, స్థితిని మార్చేలా ఉన్నాయన్నారు. ఉత్తమ ప్రొడక్టుతో తమ వద్దకు వస్తే రాష్ట్ర ప్రభుత్వమే మీ స్టార్టప్‌లకు ప్రథమ వినియోగదారుగా ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ స్టార్టప్ నిర్వాహకులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐటి శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, వి..హబ్ సిఇఒ దీప్తీ రావులతో పాటు పలువురు పాల్గొన్నారు.
KTR participates in WE Hub graduation ceremony