న్యూఢిల్లీ: జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఆటో రిక్షాతో ఢీకొట్టి ఒక న్యాయమూర్తిని హత్యచేసిన సంఘటనను శుక్రవారం సుమోటాగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు వారం రోజుల్లోగా ఈ సంఘటనపై దర్యాప్తునకు సంబంధించిన స్థాయీ నివేదికను తమకు సమర్పించాలని జార్ఖండ్ చీఫ్ సెక్రటరీని, ఆ రాష్ట డిజిపిని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును జార్ఖండ్ హైకోర్టు పర్యవేక్షిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సారథ్యంలోని ధర్మాసనం తెలిపింది. దేశవ్యాప్తంగా న్యాయాధికారులు, న్యాయ సంబంధ వ్యక్తులపై జరుగుతున్న దాడులను తాము సుమోటోగా విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది.
ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేయడంతోపాటు ఈ కేసుపై వచ్చే వారం విచారణ జరిగే సమయంలో జార్ఖండ్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు హాజరుకావలసి ఉంటుందని ఆదేశించింది. ధన్‌బాద్ జిల్లా, సెషన్స్ జడ్జి-8 ఉత్తమ్ ఆనంద్ బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా రణధీర్ వర్మ చౌక్ వద్ద ఆటో రిక్షాతో ఢీకొట్టి ఆయనను హత్య చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసును జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇప్పటికే విచారణకు స్వీకరించారని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది.