ఎన్‌ఎస్‌ఓ కార్యాలయాల్లో సోదాలు
జెరూసలెం: పెగాసస్ కుంభకోణం వ్యవహారంపై ఈ స్పైవేర్‌ను రూపొందించిన సైబర్ సెక్యూరిటీ సంస్థ ఎన్‌ఎస్‌ఓ గ్రూపుపై ఇజ్రాయెల్ దర్యాప్తు చేపట్టింది. ఈ సంస్థ స్పైవేర్‌ను ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలు వివిధ వర్గాల ప్రజలపై నిఘా పెట్టాయంటూ వార్తలు రావడం తెలిసిందే. కంపెనీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి వివిధ సంస్థలకు చెందిన అధికారులు బుధవారం ఎన్‌ఎస్‌ఓ కంపెనీకి చెందిన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించినట్లు ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు చెప్పారు. వివరాలు తెలపాలని కోరగా, ప్రస్తుతం ఈ వివరాలను వెల్లడించడం లేదని ఆ ప్రతినిధి చెప్పారు. అయితే దర్యాప్తు నిర్వహిస్తున్న సంస్థల్లో రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఎక్స్‌పోర్ట్ కంట్రోల్ డివిజన్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఉన్నాయని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. రక్షణ మంత్రిత్వశాఖ సంస్థకు ఇచ్చిన అనుమతులు, అధికారాలకు అనుగుణంగా అది నడుచుకుందా లేదా అనే దానిపై ప్రధానంగా ఈ సంస్థలు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపాయి. కాగా దాడులను ఎన్‌ఎస్‌ఓ గ్రూపునకు ప్రాతినిధ్యం వహిస్తున్న మెర్కురీ పబ్లిక్ అఫైర్స్ ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. ఈ తనిఖీలను తాము స్వాగతిస్తున్నట్లు కూడా పేర్కొంది