అన్ని స్థాయిల్లోని న్యాయమూర్తులకు స్వేచ్ఛ లభించినప్పుడే న్యాయ వ్యవస్థ స్వేచ్ఛగా మనగలుగుతుందని, రాజకీయ ఒత్తిళ్ల నుంచి జడ్జిలకు రక్షణ కల్పించడం అత్యంత అవసరమని న్యాయమూర్తులు డి.వై చంద్రచూడ్, ఎంఆర్ షా లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 22న మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక కేసులో గట్టిగా స్పష్టం చేసింది. దానిని ఇంకా మరచిపోకముందే జార్ఖండ్‌లో ఒక అడిషనల్ సెషన్స్ జడ్జిని ఆటోతో డీ కొని హతమార్చిన దారుణం జరిగిపోయింది.
అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ బుధవారం ఉదయం తన అధికారిక నివాస గృహం సమీపంలోని రోడ్డుపై మార్నింగ్ వాక్ చేస్తుండగా వెనుక నుంచి ఆటో డీ కొనడంతో అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయారు. ఆసుపత్రికి తీసుకు వెళ్లగా అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ప్రకటించారు. ఆటో డీ కొనడం ప్రమాదవశాత్తు జరిగినదేనని ముందు అనుకున్నారు. ఆ తర్వాత సిసిటివిలలో రికార్డయిన దృశ్యాలను గమనించగా ఆటో డ్రైవర్ కావాలనే బండిని ఆయన మీదకు నడిపించినట్టు స్పష్టపడింది. కింది జడ్జిలు ఎదుర్కొంటున్న ప్రాణ భయాన్ని ప్రస్తావిస్తూ న్యాయమూర్తులందరికీ రక్షణ ఉండాలని జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం వ్యాఖ్యానించి వారం రోజులైంది.
ఆటో దాడిలో మరణించిన అదనపు సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ మాదిరిగానే మధ్యప్రదేశ్‌లో పని చేస్తున్న జిల్లా స్థాయి జడ్జి ఒకరు రాజకీయ పలుకుబడి గలిగిన ఒక ప్రముఖుని కేసు చూస్తున్నప్పుడు తనకు ప్రాణ భయం కలిగిందని రికార్డుల్లో పేర్కొన్నారు. ఆ రాష్ట్రానికి చెందిన బిఎస్‌పి శాసన సభ్యురాలొకరి భర్త అయిన ఆ ప్రముఖుడు ఒక కాంగ్రెస్ నేత హత్య కేసులో నిందితుడై ఉండి రెండేళ్లుగా బెయిల్ మీద బయట స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అతడికి మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ కేసు రికార్డుల్లో తన ప్రాణానికి ముప్పు ఎదురైందని కింది స్థాయి జడ్జి వ్యక్తం చేసిన అభిప్రాయం న్యాయమూర్తి చంద్రచూడ్ దృష్టికి వచ్చింది. దానితో ఆయన ఆ ప్రముఖునికి బెయిల్ ఇచ్చిన మధ్యప్రదేశ్ హైకోర్టును కూడా తప్పుపట్టారు. బెయిల్ మంజూరు చేయడం ద్వారా హైకోర్టు నేర న్యాయ ప్రక్రియను అడ్డుకున్నదని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
మధ్యప్రదేశ్ పోలీసులకు చివాట్లు పెట్టారు. మధ్యప్రదేశ్‌లో కింది స్థాయి జడ్జి, ఒక ప్రముఖుని కేసు సందర్భంగా ప్రాణ భయాన్ని మాత్రమే ఎదుర్కొనగా ధన్‌బాద్ అడిషనల్ సెషన్స్ జడ్జి ప్రాణాల మీదకే వచ్చింది. జడ్జి ఉత్తమ్ ఆనంద్ మీదికి ఆటోను నడిపించిన వ్యక్తి, అతనికి అండగా వ్యవహరించిన మరో వ్యక్తి దొంగతనం కేసుల్లో నిందితులని బయటపడింది. రాత్రి 2 గం॥ ల సమయంలో ఆటోను అపహరించి తెల్లవారు 5 గం॥ల సమయంలో వారు దానిని జడ్జి మీదికి నడిపించారు. ఐదు హత్య కేసులను ఉత్తమ్ ఆనంద్ విచారిస్తున్నారు. అందులో ఒకటి బొగ్గు అక్రమ రవాణా సందర్భంగా జరిగిన హత్యకు సంబంధించిందని వార్తలు చెబుతున్నాయి. యుపికి చెందిన ఇద్దరు ముఠా సభ్యులకు బెయిల్‌ను ఉత్తమ్ ఆనంద్ నిరాకరించినట్టు సమాచారం. ఆ కక్షతో వారు ఈ హత్య చేయించి ఉండవచ్చనే అనుమానం ఉంది. బొగ్గు, ఇనుప ఖనిజం, ఫాస్పేట్, కోబాల్ట్ వంటి గనులు దండిగా ఉన్న రాష్ట్రం జార్ఖండ్.
ఇంకా చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోని ఆదివాసీ ప్రాంతాల్లో కూడా ఈ గనులు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి. వాటి మీద దేశ విదేశీ పెట్టుబడిదారులు కన్ను వేసిన సంగతి తెలిసిందే. అక్కడ బతుకుతున్న ఆదివాసీలను బలవంతంగా తరలించడం ద్వారా వాటిని వారికి అప్పగించడానికే మన ప్రభుత్వాలు మొగ్గు చూపుతున్నాయి. ఇందుకు ఆదివాసీల నుంచి ప్రతిఘటన ఎదురు కావడం, వారి వెనుక గల కార్యకర్తలను, మేధావులను నక్సలైట్లుగా, మావోయిస్టులుగా పాలకులు ముద్ర వేసి వేధిస్తున్నారనే అభిప్రాయం స్థిరపడింది. బొగ్గు గనులపై పట్టు కోసం బడా పెట్టుబడిదార్లు పావులు కదిపే క్రమంలో ఘర్షణలు, హత్యలు సంభవించడం మామూలే. అడిషనల్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ అటువంటి ఒక హత్య కేసును విచారిస్తున్న సందర్భంలో ఆయన మీదికి ఆటోను పంపించి హతమార్చడం అనేక అనుమానాలకు దారి తీస్తుంది.
ఈ కేసును కూలంకషంగా శోధించి అటువంటి మాఫియా హస్తం జడ్జి హత్య వెనుక ఉండి ఉంటే దాన్ని సమూలంగా బయటపెట్టవలసి ఉంది. న్యాయమూర్తుల ప్రాణాలకే ముప్పు వాటిల్లుతున్న చోట సాధారణ ప్రజలకు రక్షణ ఎక్కడిది? దేశ పాలకులు ఖనిజ పరిపుష్టమైన ఆదివాసీ ప్రాంతాల ప్రజలను నేరస్థులుగా పరిగణించే ధోరణిని విడిచిపెట్టి గనుల దోపిడీని అరికట్టే విషయంలో న్యాయ స్థానాల సహకారాన్ని తీసుకోవలసి ఉంది. అన్ని స్థాయిల్లోని న్యాయమూర్తులకు తగిన రక్షణ కల్పించవలసి ఉంది.