ఆర్థిక పరిమితుల మేరకు దశలవారీగా రాష్ట్రమంతటా ఈ పథకాన్ని అమలుచేస్తాం
ప్రతిపక్షాలు బాంబులు పడ్డట్టు భయపడుతున్నాయి అట్టడుగు వర్గాల కోసం పథకాన్ని ప్రకటిస్తే
బురదజల్లే యత్నం చేస్తున్నారు ఇంత చిల్లర రాజకీయాలు ఎక్కడైనా ఉన్నాయా? : బిజెపికి
రాజీనామా చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్
త్వరలో చేనేత బంధు దేశంలోనే
మనం నెం.1 ఆ ప్రాజెక్టులు పూర్తి
అయితే రాష్ట్రం కాశ్మీరమే జానారెడ్డి
మాట తప్పారు చిల్లర అరుపులను
పట్టించుకోం రాష్ట్రంలో
ఆకలిచావులు లేవు మన పథకాలు
ఇంకెక్కడా కానరావు
మన తెలంగాణ/ హైదరాబాద్: ఆరు నూరైనా దళిత బంధు పథకం ఆగదని టిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఈ పథకాన్ని ఎవరూ ఆపలేరన్నారు. దీనిని విజయవంతంగా వందశాతం అమలు చేసి తీరుతామన్నారు. దళితబంధు అంటేనే బాంబులు పడ్డట్లు ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. వారు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా అర్హులైన దళిత వర్గాలకు ఈ పథకాన్ని అందించి తీరుతామన్నారు. ఆర్థిక పరిమితుల మేరకు దశలవారీగా రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. అవసరమైనతే దళిత బంధు కోసం రూ.లక్ష కోట్లయినా ఖర్చు చేస్తామని అని సిఎం కెసిఆర్ తెలిపారు. దళితబంధు పథకం ఏడాది ముందే ప్రారంభంకావాల్సి ఉండగా కరోనా వల్ల సంవత్సరం ఆలస్యమైందన్నారు. ఇటీవల బిజెపి రాజీనామా చేసిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి శుక్రవారం తెలంగాణ భవన్లో సిఎం కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్లో చేరారు.
పెద్దిరెడ్డిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి సిఎం ఆహ్వానించారు. ఆయనతో పాటు మరో 31 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా టిఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, పెద్దిరెడ్డి తనకు సన్నిహిత మిత్రుడన్నారు. టిడిపిలో ఇద్దరం ఒకే సమయంలో మంత్రులుగా కలిసి పనిచేశామన్నారు. ఆయన కార్మిక శాఖ మంత్రిగా కూడా పని చేశారన్నారు. మంచి విలువలు కలిగిన నేత అని వ్యాఖ్యానించారు. ఇకపై రాష్ట్ర ప్రగతి ప్రస్థానంలో ఆయన చేదోడు వాదోడుగా ఉంటారన్నారు. అలాంటి వ్యక్తి టిఆర్ఎస్లో చేరడం ఆనందం గా ఉందన్నారు. ప్రతిపక్షాలు ఎప్పుడూ రాజకీయాలు చేయాలనుకోవడం మంచిది కాదని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ సూచించారు. ప్రజల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై కూడా వారు దురుద్దేశపూర్వకంగా విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
సమాజంలో అట్టుడుగు వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సాహోసపేతంగా దళితబంధు పథకాన్ని ప్రకటిస్తే… దానిపై కూడా ఉన్నవి, లేనివిగా పేర్కొంటూ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం యత్ని స్తున్నారని సిఎం కెసిఆర్ మండిపడ్డారు. ఇంత చిల్లర రాజకీయాలు ఎక్కడైనా ఉన్నాయా? అని సిఎం నిలదీశారు. ప్రజల కు మేలు జరిగితే హర్షించాల్సిన ప్రతిపక్షాలు కళ్లలో కారంపోసుకుంటున్నాయన్నారు. వారి తాటాకు చప్పుళ్లకు తాము భయ పడబోమని స్పష్టం చేశారు. మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో అన్ని రంగాలు గాఢీలో పడ్డాయని సిఎం కెసిఆర్ తెలిపారు. ఈ ప్రస్థానం భవిష్యత్‌లో కూడా కొనసాగుతుందన్నారు, దాన్ని ప్రజలు కాపాడుకుంటారని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రంలో ప్రవేశపెట్టున్న దళితబంధు దేశానికే ఆదర్శంగా మారనుందని ఈ సందర్భం గా సిఎం తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మనిషి చంద్రుని మీదకు వెళ్లినా- దళితులు కఠిన పేదరికంలో ఉండటం మంచిది కాదన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్ బాల్కసుమన్, ఇటీవలే టిఆర్ఎస్లో చేరిన ఎల్. రమణతో పాటు పలువురు పాల్గొన్నారు.
త్వరలో చేనేత కార్మికులకు కూడా బీమా సౌకర్యం కల్పిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. రైతు బీమా మాదిరిగానే చేనేత బీమా కూడా ఉంటుందన్నారు. వ్యవసాయ శాఖలో పక్కాగా రైతుబంధు అమలవుతోందన్నా రు. రైతు బంధు, రైతు బీమా అమలుకు ఏడాది పట్టిందన్నా రు. రాష్ట్రంలో ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక అధికారి ఉన్నా రు. రైతులు కుటుంబాలకు 10 రోజుల్లో బీమా అందుతోందన్నారు. సామాజిక వివక్షకు గురైన వారికి పకడ్బందీగా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు.మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలో లేవన్నారు. ఎస్సి సంక్షేమ శాఖలోనూ రైతు బీమా తరహా ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలో దళితుల సంఖ్య 18 నుంచి 19 శాతం మేర కు ఉంటుందన్నారు. ప్రజలను మెప్పించి పాలన చేస్తే దాన్ని ప్రజాస్వామ్యం అంటారన్నారు. ఒట్టిగనే మాటలు చెప్పడం టిఆర్ఎస్ ప్రభుత్వానికి చేతకాదని పేర్కొన్నారు. అనేక విషయాల్లో తెలంగాణ నంబర్ వన్ అని పార్లమెంట్లో కేంద్రం చెబుతోందన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు చూసి మహారాష్ట్రలోని 47 గ్రామాలు తెలంగాణలో కలుస్తాం అని తీర్మానాలు చేశాయని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ గుర్తు చేశారు.
ఆ ప్రాజెకుల్టు పూర్తి అయితే తెలంగాణ కాశ్మీరమే
రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు, రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ కాశ్మీరం అవుతుందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే అనేక సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంతో రాష్ట్రంలో పెద్దఎత్తున పంటలు పండుతున్నాయన్నారు. గతేడాది రాష్ట్రంలో కోటి ఎకరాల భూమి సాగైందన్నారు. రాష్ట్రంలో 3కోట్ల టన్నుల వరి ధాన్యం పండిందన్నారు.జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువని సిఎం కెసిఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కచ్చితంగా ధనిక రాష్ట్రమేనని సిఎం కెసిఆర్ మరోసారి పునరుద్ఘాటించారు. అయినప్పటికీ కొంతమంది సన్నాసులకు అర్థం కావడం లేదని మండిపడ్డారు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తామని అసెంబ్లీలో తాను చెబితే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి నమ్మలేదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. పైగా 24 గంటల కరెంటు అమలు అయితే టిఆర్ఎస్ కండువా కప్పుకుంటా అని జానారెడ్డి అసెంబ్లీలోనే చెప్పారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే ఆయన మాటతప్పి ఇటీవల నాగార్జున సాగర్‌కు జరిగిన ఉపఎన్నికలో పోటీ చేశారన్నారు.-
చిల్లర అరుపులను పట్టించుకోం
చిల్లర అరుపులను పట్టించుకోకుండా అభివృద్ధి కోసం తాము ముందుకు సాగుతామని సిఎం కెసిఆర్ తెలిపారు.- ఏనుగు పోతుంటే చిన్న చిన్న జంతువులు అరుస్తుంటే వాటిని పట్టించుకోవన్నారు. ఏనుగు తరహాలో తాము కూడా ప్రతిపక్షాల చిల్లర అరుపులను పట్టించుకొమన్నారు. తెలంగాణలో ఆకలిచావులు-, ఆత్మహత్యలు లేవని పార్లమెంట్ లో కేంద్రమంత్రి అధికారిక ప్రకటన చేశారన్నారు. ఉమ్మడి పాలనలో ప్రతిరోజు రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ప్రతిరోజు వినిపించేవాన్నారు. పోరాడి సాధించిన స్వరాష్ట్రంలో అటువంటి ఘటనాలు పునారవృతం కాకూడదన్న ధృడసంకల్పంతోనే వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చామన్నారు. పంటలకు అవసరమైన సాగునీరు…కరెంటు సరఫరా విషయంలో ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ప్రస్తుతం దేశానికే తెలంగాణ అన్నం పెట్టే రాష్ట్రంగా ఎదిగిందన్నారు.
మన పథకాలు…ఏ రాష్ట్రంలో కూడా లేవు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణాలక్ష్మి, కెసిఆర్- కిట్ వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని సిఎం కెసిఆర్ అన్నారు. ఏ రాష్ట్రం కూడా అమలు చేయడం లేదన్నారు. గతంలో ప్రసవానికి హాస్పిటల్ కి పోతే దోపిడీ జరిగేదన్నారు. ఒక్కో ప్రసవానికి రూ. 70వేలు దోచుకునే వారన్నారు. కెసిఆర్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య బాగా పెరిగిందన్నారు. అలాగే కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకలతో పేదల కుటుంబాల్లో పెళ్లీడుకు వచ్చిన యువతులకు వివాహం జరిగే నాటికి లక్ష రూపాయలకు పైగా రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని చెక్‌రూపంలో అందిస్తోందన్నారు. పల్లెలకు సంక్షే మం అందుతుంటే ప్రజలు అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని సిఎం కెసిర్ అన్నారు. గ్రామాలకు నిధులు వరుసపెట్టి వస్తున్నాయన్నారు. దళితుల కోసం బీమా చెయ్యటానికి కొంత టైం పడుతుందన్నారు. రైతుబంధు- బీమా కోసం ఏడాది కాలం పట్టిందన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలే ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయన్నారు. జాగ్రత్తగా పాలన చేస్తేనే ఇవ్వాళ దేశంలో నెంబర్‌వన్ రాష్ట్రంగా ఎదిగామని అన్నారు. తెలంగాణ ఏర్పాటు కొత్త లో వృద్ధులు రెండు పూటలు తినేందుకు ఆనాడు పెన్షన్స్ ఆరు వందలు అని అంటే- రూ.1000 లకు పెంచానని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో పాత సిఎం కార్లకు తెల్లరంగు వేసి జాగ్రత్తగా వ్యవహరించామన్నారు. ప్రజల డబ్బును జాగ్రత్తగా కాపాడామన్నారు.