Saturday, November 23, 2024

రాజకీయాలకు సుప్రియో గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

BJP Babul Supriyo goodbye to politics

ఎంపి పదవికీ రాజీనామా చేస్తా
సంచలన నిర్ణయం ప్రకటించిన బిజెపి ఎంపి
ఇకపై సామాజిక సేవపై దృష్టిపెడతానన్న మాజీ కేంద్రమంత్రి

కోల్‌కతగా: భారతీయ జనతా పార్టీ నేత, మాజీ కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శనివారం తనఫేస్‌బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు పెట్టారు. ఇకపై సామాజిక సేవపై దృష్టిపెట్టనున్నట్లు ప్రకటించారు. కేంద్రమంత్రివర్గంనుంచి బాబుల్‌ను తొలగించిన కొద్ది రోజలకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఢిల్లీలో కేంద్రప్రభుత్వం తనకు కేటాయించిన నివాసాన్ని కూడా నెలరోజుల్లో ఖాళీ చేస్తానని బాబుల్ తెలిపారు. తన ఎంపి పదవికి కూడా రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.‘అల్విదా.. నేను టిఎంసి, కాంగ్రెస్, సిపిఎం.. ఇలా ఏ పార్టీలోకి వెళ్లడం లేదు. పార్టీల్లోకి రమ్మని నన్నెవరు కూడా ఆహ్వానించలేదు. ఎప్పటికీ ఒకే పార్టీలో (బిజెపి) ఉంటా. నావల్ల కొంత మంది సంతోషపడ్డారు. మరి కొందరు బాధపడ్డారు. ఎన్నో సుదీర్ఘ చర్చల అనంతరం నేను ఓ నిర్ణయం తీసుకున్నా. రాజకీయాలనుంచి వైదొలగుతున్నా. రాజకీయాల్లో ఉండి సామాజిక సేవ చేయడం సాధ్యంకాదు. నన్ను అపార్థం చేసుకోకండి’ అంటూ బాబుల్ బెంగాలీలో రాసుకొచ్చారు.

ప్రముఖ గాయకుడైన బాబుల్ సుప్రియో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు. ఆ ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నియోజకవర్గంనుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మోడీ నాయకత్వంలో తొలిసారి ఏర్పాటైన కేంద్రమంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రిగా పని చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో అస్‌సోల్‌నుంచి రెండోసారిలోక్‌సభకు ఎన్నికయ్యారు. రెండో సారి కూడా కేంద్ర మంత్రిపదవి దక్కించుకున్నారు. అయితే ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలయిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో బాబుల్‌నుకూడా పార్టీ బరిలోకి దింపింది. అయితే టిఎంసి అభ్యర్థి అరూప్ బిశ్వాస్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. దీంతో బిజెపి అధినాయకత్వం బాబుల్‌పై కాస్త అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన కేంద్రమంత్రివర్గ విస్తరణలో 12 మంది మంత్రులకు మోడీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. వారిలో బాబుల్ కూడా ఒకరు. మరోవైపు బెంగాల్ బిజెపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్‌తో ఈయనకు విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో బాబుల్ పార్టీని వీడనున్నట్లు కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన రాజకీయాలకు గుడ్‌బై చెప్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News