నిబంధనలు కచ్చితంగా పాటించాలని 10 రాష్ట్రాలకు కేంద్రం సూచన
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండడంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా పది రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా కేసులు పెరుగుతున్నాయని, కరోనా రేటు 10 శాతం మించిన జిల్లాల్లో ప్రజలు నిబంధనలు మరింత కట్టుదిట్టంగా పాటించ వలసి ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది. ఈమేరకు పది రాష్ట్రాల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష శనివారం నిర్వహించింది.ఈ సమావేశానికి కేంద్ర వైద్య ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అధ్యక్షత వహించారు. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా , అసోం, మిజోరం, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిని ఈ సమావేశంలో సమీక్షించారు. కరోనా వ్యాప్తి, సంక్రమణ, అదుపు నకు ఎలాంటి చర్యలు ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్నారో సమీక్షించారు.
ఈ రాష్ట్రాల్లోని 46 జిల్లాల్లో 10 శాతం కన్నా ఎక్కువగా, మరో 53 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్యన కరోనా పాజిటివిటీ కనిపిస్తోందని సమావేశం పేర్కొంది. ఈ రాష్ట్రాలు కరోనా పరీక్షలతోపాటు టీకా పంపిణీని ముమ్మరం చేయాలి సూచించింది. 60 ఏళ్ల వయసు పైబడిన వారితోపాటు 4550 ఏళ్ల వారికి కూడా కొవిడ్ మరణాల ముప్పు 80 శాతం ఎక్కువగా ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నందున టీకా పంపిణీని ముమ్మరం చేయాలని , రెండో డోసు వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రైవేట్ ఆస్పత్రులు ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించాలని పేర్కొంది. 80 శాతం కన్నా ఎక్కువ యాక్టివ్ కేసులున్న రాష్ట్రాల్లో 80 శాతం బాధితులు హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నందున వారిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వారిలో ఆస్పత్రి అవసరం ఏర్పడిన వారిని తక్షణం ఆస్పత్రికి తరలించాలని రాష్ట్రాలకు సూచించింది. పాజిటివ్ రేటు 10 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాలపై దృష్టి కేంద్రీకరించి వాక్సినేషన్ సరిగ్గా జరిగేలా చూడాలని కోరింది. కొత్త వేరియంట్లను గుర్తించడానికి విదేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికుల నమూనాలకు ‘ఐఎన్‌ఎస్‌ఎసిఒజి’ సాయంతో జన్యుక్రమ సరళి పరీక్షలను చేపట్టాలని సూచించింది. ఆర్‌టి పిసిఆర్ ప్రయోగశాలలు లేదా సెకండరీ, ప్రాంతీయ ఆరోగ్యభద్రత కేంద్రాల ద్వారా కరోనా కేసుల వ్యాప్తిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించింది.