కెరీర్‌లోనే గొప్ప విజయం నమోదు చేసిన జర్మనీ క్రీడాకారుడు
టోక్యో: ఒలింపిక్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ సంచలన విజయం సాధించాడు. ఫైనల్‌లో రష్యా ఆటగాడు కారన్ కచనోవ్‌పై 6- 3,6- 1 తేడాతో గెలుపొంది బంగారు పతకం సాధించాడు. దీంతో కెరీర్‌లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాడు. కాగా జ్వెరేవ్ కెరీర్‌లో ఇప్పటివరకు ఒక్క గ్రాండ్‌శ్లామ్‌ను కూడా సాధించలేదు. గత ఏడాది యుఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరి డొమినిక్ థీమ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. అదే జ్వెరేవ్‌కు ఇప్పటివరకు ఉన్న అత్యుత్తమ ప్రదర్శన. ఆదివారం ఒలింపిక్స్ ఫైనల్లో విజయం సాధించడం ద్వారా తొలిసారి స్వర్ణం సాధించాడు. ఇదే విజయంతో జర్మనీ తరఫున టెన్నిస్ సింగిల్స్ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన క్రీడాకారుడిగా జ్వెరెవ్ రికార్డు సృష్టించాడు. గంటా 19 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో జ్వెరెవ్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యంచెలాయించాడు. కచనోవ్‌కు ఏ దశలోను అవకాశం ఇవ్వకుండా తన కలను సాకారం చేసుకున్నాడు. మరోవైపు జ్వెరెవ్ సెమీస్‌లో దిగ్గజ ఆటగాడు జకోవిచ్‌ను ఓడించిన విషయం తెలిసిందే. ఇక జకోవిచ్ శనివారం కాంస్యంకోసం జరిగిన మ్యాచ్‌లోనూ స్పెయిన్‌కు చెందిన పాబ్లో బుస్టా చేతిలో ఓటమి పాలయి తీవ్ర నిరాశకు గురయ్యాడు.