Saturday, November 23, 2024

కాంస్య ‘సింధువు’

- Advertisement -
- Advertisement -

PV Sindhu won bronze medal in Olympics

రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక భారతీయ
క్రీడాకారిణి, చైనాకు చెందిన హి బింగ్జియావోపై వరుస
సెట్లలో విజయం సాధించిన తెలుగు తేజం పి.వి సింధు

టోక్యో: ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో తెలుగు తేజం పివి సింధు కాంస్యపతకం సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆదివారం చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో సింధు స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. వరస గేమ్స్‌లో 2113 21 15తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండో పతకాన్ని అందించింది.2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు .. తాజా ఒలింపిక్స్‌లో కాంస్యంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. శనివారం జరిగిన సెమీస్ పోరులో చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్ చేతిలో 18 21, 12 21తేడాతో ఓటమి పాలయిన సింధు ఆదివారం కాంస్యం కోసం జరిగిన పోరులో హి బింగ్జియావోపై ఘన విజయం సాధించింది. దీంతో వరసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణిగా సింధు సరికొత్త రికార్డు సృష్టించింది.ఈ మ్యాచ్‌లో సింధు ఆదినుంచి పూర్తి ఆధిపత్యం చెలాయించింది.

తొలి గేమ్‌లో విరామ సమయానికి 11 8 పాయింటట్లతో ఆధిక్యంలో నిలిచిన సింధు ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడి ప్రత్యర్థిని కట్టడి చేసింది. వరస పాయింట్లు సాధిస్తూ చైనా క్రీడాకారిణిని ఒత్తిడిలోకి నెట్టింది. మ్యాచ్‌లో ఒక్కసారి మాత్రమే బింగ్జియావో స్వల్ప ఆధిక్యత కనబరిచినా ఆ తర్వాత సింధు వరసగా అయిదు పాయింట్లు సాధించి తిరుగులేని ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే తొలి గేమ్‌ను 21 13 తేడాతో కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో కూడా సింధూనే దూకుడు ప్రదర్శించింది. మధ్యలో బింగ్జియావో గట్టిగా పోరాడేందుకు చూసినా సింధు ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో విరామం సమయానికి 11 8 పాయింట్ల ఆధిక్యతలో నిలిచింది. ఆ తర్వాత అదే ఆధిక్యతను కొనసాగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో చివరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో తెలుగు తేజం 21 15తో విజయం సాధించింది. దీంతో వరసగా రెండు ఒలింపిక్స్‌లోను వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది.

అయితే ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో భారత్‌కు తొలి పతకం అందించింది మాత్రం సైనా నెహ్వాలే. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో సైనా కాంస్యం గెలిచింది. కాగా 2014 ఆసియన్ చాంపియన్‌షిప్స్‌లో కాంస్యం సాధించడంతో సింధు పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. కామన్వెల్త్ గేమ్స్, ఆసియన్ గేమ్స్‌లోను కాంస్యం గెలుచుకుంది. ఆ ఏడాది ఏకంగా అయిదు పతకాలు కొల్లగొట్టింది. ఇవే కాక బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో ఒక బంగారు పతకం, రెండు రజత పతకాలు, రెండు కాంస్య పతకాలు మొత్తం అయిదు పతకాలు సాధించింది.

రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు

ఒలింపిక్స్‌లో వరసగా రెండో సారి పతకం సాధించిన పివి సింధును రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. సింధు దేశానికే గర్వ కారణమని, అద్భుతమైన ఒలింపియన్లలో ఆమె కూడా ఒకరని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. కాగా సింధు నిలకడకు, అంకిత భావానికి మారుపేరుగా నిలుస్తుందని రాష్ట్రపతి పేర్కొన్నారు. దేశానికి గౌరవాన్ని తీసుకువచ్చిన ఆమెను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు కేంద్రమంత్రులు, సిఎంలు కూడా సింధుకు అభినందనలు తెలియజేశారు.

ఎంతో గర్వంగా ఉంది
సింధు భావోద్వేగం

కాగా మ్యాచ్ అనంతరం సింధు మీడియాతో మాట్లాడుతూ “ఇన్నేండ్లుగా పడిన కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నన్ను చాలా ఎమోషన్స్ వెంటాడుతున్నాయి. కాంస్య పతకం సాధించినందుకు సంతోషించాలో..ఫైనల్లో ఆడే అవకాశాన్ని కోల్పోయినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. ఏదేమైనప్పటికీ ఈ మ్యాచ్ ఆడేటప్పుడు నా భావోద్వేగాలన్నిటినీ పక్కన పెట్టి నా శాయశక్తులా ఆడాను. ఇప్పుడు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. నా దేశానికి మెడల్ సాధించి పెట్టినందుకు గర్వపడుతున్నా’ అని చెప్పుకొచ్చింది. తనపై ప్రేమాభిమానాలు చూపిన అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొంది. ఒలింపిక్స్‌లో గెలవడం పట్ల చాలా సంతోషంగా ఉందని, ఈ మధుర క్షణాలను చాలా ఎంజాయ్ చేస్తున్నాని తెలిపింది. తన గెలుపు కోసం కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడ్డారని పేర్కొంది.

సింధు సాధించిన పతకాలు

ఒలింపిక్స్

2016లో రజతం
2020లో కాంస్యం

ప్రపంచ చాంపియన్‌షిప్

2013లో కాంస్యం
2014లో కాంస్యం
2017లో రజతం
2018లో రజతం
2019లో బంగారు

ఆసియా చాంపియన్ షిప్

2014లో కాంస్యం

బిడబ్లూఎఫ్ సూపర్ సిరీస్ ఫైనల్స్

2017లో రన్నర్స్ అప్

బిడబ్లూఎఫ్ వరల్డ్‌టూర్ ఫైనల్స్

2018లో చాంపియన్

ఆసియా క్రీడలు

2014లో కాంస్యం
2018లో రజతం

కామన్‌వెల్త్ క్రీడలు

2014లో కాంస్యం
2018లో మిక్స్‌డ్ టీం బంగారు
2018లో రజతం

ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ చాంపియన్

2017లో చాంపియన్
2018లో రన్నర్స్‌అప్

చైనా ఓపెన్ సూపర్‌సిరీస్ ప్రీమియర్

2016లో చాంపియన్
కొరియా ఓపెన్ సూపర్‌సిరీస్
2017లో చాంపియన్

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News