Sunday, November 3, 2024

అభివృద్ధి అంటే ఏంటో సాగర్ నియోజకవర్గ ప్రజలకు రుచి చూపిస్తా: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నాగార్జున సాగర్: హైదరాబాద్‌లో నాలుగు సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. నాగార్జున సాగర్ నియోజక వర్గ అభివృద్ధి పై సమీక్ష సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ అభ్యర్థి నోముల భగత్ ను గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కరోన మహమ్మారి కారణంగా కొంత ఆలస్యంగా నియోజకవర్గానికి వచ్చానని, గత ప్రభుత్వాల హయాంలో సాగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనకబడి ఉందని,  అభివృద్ధి జరగలేదని, నాగార్జున సాగర్ లోని క్వార్టర్స్ ల్లో, ఇరిగేషన్ స్థలాల్లో ఇల్లు కట్టుకొని ఉంటున్న వారందరికి రెగ్యులరైజ్ చేస్తూ పట్టాలు అందిస్తామన్నారు. గుర్రంపోడ్ లిఫ్ట్ ఏర్పాటు సర్వేకు ఆదేశిస్తున్నామని కెసిఆర్ తెలిపారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని తెలియజేశారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పిహెచ్‌సిని విస్తరించుకుందామని, కొత్తగా 15 లిఫ్ట్ స్కీమ్‌లను నల్లగొండ జిల్లాకు మంజూరు చేశామని వివరించారు. ఏడాదిన్నర లోపు అన్ని లిఫ్టులను పూర్తి చేసి నీళ్లందిస్తామన్నారు. కేంద్రం అవలంభించే విధానాలతో కృష్ణా నదిపై ఎపి ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కడుతోందని మండిపడ్డారు. పెద్దదేవులపల్లి, పాలేరు రిజర్వాయర్ అనుసంధానం చేసి నీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తామని కెసిఆర్ పేర్కొన్నారు. సాగర్ నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేశామని, హాలియాలో మినీ స్టేడియం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. హాలియా పట్టణాన్ని చూసిన తరువాత అభివృద్ధి ఇంకా ఎంత జరగాలో తనకు అంచనా వచ్చిందని కెసిఆర్ పేర్కొన్నారు. అభివృద్ధి అంటే ఏంటో సాగర్ నియోజకవర్గ ప్రజలకు రుచి చూపిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న మిషన్ భగీరథ కనెక్షన్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, మండలి మాజీ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ వైస్ ఛైర్మన్ విద్యాసాగర్, ఎంపిలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సీలు, డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

దళిత బంధు అనగానే ప్రతిపక్షాల గుండెల్లో దడ మొదలయిందని, ఇక తమకు పుట్టగతులు ఉండవని ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయని, ఆరు నూరైన దళిత బంధు అమలు చేసి చూపిస్తామని, ఆనాడు తెలంగాణ తెస్తా అంటే కూడా నమ్మలేదని, ఈ దద్దమ్మలు సమాఖ్య పాలకుల సంచులు మోశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టినారని, వీళ్లా ఇవ్వాళ మాట్లాడేది అని కెసిఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మూడు కోట్ల వరి ధాన్యాన్ని పండించి నా తెలంగాణ సగర్వంగా నిలబడిందని, తనకు గుండె నిండా సంతోషం తొణికిసలాడుతున్నదని, ప్రతిపక్షాలు మాట్లాడే అవాకులు చవాకులు పట్టించుకోవద్దన్నారు.

దామరచర్ల లో 30 వేల కోట్లతో అల్ట్రా పవర్ థర్మల్ ప్లాంట్ నిర్మాణం చేస్తున్నామని, ఇది నల్లగొండ జిల్లాకే గర్వ కారణమైన పవర్ ప్లాంట్ అని, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పట్టుబట్టి దామరచర్ల లో నెలకొల్పేలా చేశారని, ప్లాంట్ నిర్మాణంతో నల్గొండ జిల్లా ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని, తెలంగాణ ప్రభుత్వంలో తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేసుకున్నామని, సాగర్ లో బంజారా భవన్ ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. పోడు భూములు సమస్యను కూడా పరిష్కారం చూపెడుతామని,  రాష్ట్రంలో 12,796 గ్రామాల్లో పల్లె ప్రగతి అద్భుతమైన మార్పు తీసుకొచ్చిందని, సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టామని, హరితహారాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మూడు కోట్ల టన్నుల వరి ధాన్యం పండించి ఆల్ టైమ్ రికార్డు సృష్టించామని, తెలంగాణలో మన్నికైనా, నాణ్యతా పత్తి పండిస్తున్నామని, అది మనకు గర్వకారణమని, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని, నాగార్జున సాగర్ ప్రజలు చైతన్యం చూపెట్టి టిఆర్ఎస్ ను గెలిపించారని పొగిడారు. 70 ఏండ్ల స్వతంత్ర భారతంలో దళితులు వెనకబడి వున్నారని, దళిత బంధు కోసం లక్ష కోట్లు అయిన ఖర్చు చేస్తామని కెసిఆర్ స్పష్టం చేశారు. కెసిఆర్ అంటే అది శాసనమేనని, దళిత బంధు కూడా అంతే, అమలు చేసి దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతామని, తెలంగాణ 24 గంటల ఉచిత కరంట్ ఇస్తా అంటే కాంగ్రెస్ నేత జానారెడ్డి నమ్మలేదని, అవహేళన చేశారని, ఇస్తే టిఆర్ఎస్ కండువా కప్పుకొని ప్రచారం చేస్తా అన్నాడని, కానీ జానారెడ్డి మాట తప్పారన్నారు. ఇవాళ ఉచిత విద్యుత్ విజయవంతంగా అమలు చేస్తున్నామని, దళిత బంధుపై అనుమానాలు అపోహలు ప్రతిపక్షాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.  వాళ్లకు బాధ్యత లేదని, 12 లక్షల మంది దళిత కుటుంబాల అందరికి 10 లక్షల రూపాయలను దళిత బంధు పథకం కింద మంజూరు చేస్తామన్నారు. వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకునేల చర్యలు తీసుకుంటామని, గత ప్రభుత్వం దళితులను పట్టించుకోలేదని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News