Saturday, November 23, 2024

రద్దయిన చట్టం కింద కేసులు : రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

- Advertisement -
- Advertisement -

Supreme notices to states on registration of cases under Section 66A

 

న్యూఢిల్లీ : రద్దయిన ఐటి (ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ) చట్టం లోని 66 ఎ సెక్షన్ కింద ఇంకా కేసులు నమోదు కావడంపై సమాధానం ఇవ్వాలంటూ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సుప్రీం కోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఐటి చట్టం లోని సెక్షన్ 66ఎను కొట్టివేసినప్పటికీ దీన్ని కొనసాగిస్తుండడంపై పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (ఎన్‌జిఒ) పిటిషన్ దాఖలు చేసింది.దీనిపై సత్వరం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించింది. దీనిపై జస్టిస్ ఆర్.ఎఫ్ నారిమన్, బిఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం ఇది చాలా దారుణమైన పరిణామమని వ్యాఖ్యానిస్తూ తాజా నోటీసులు జారీ చేసింది. రద్దు చేసిన సెక్షన్‌ను కేవలం పోలీస్ స్టేషన్ల లోనే కాకుండా దేశం లోని ట్రయిల్ కోర్టుల్లోనూ కొనసాగిస్తున్నారంటూ పిటిషనర్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ జ్యుడీషియరీగా తాము ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని, అయితే పోలీసులు కూడా ఇందులో ఉన్నందున రద్దయిన సెక్షన్ కొనసాగించకుండా సరైన ఉత్తర్వులు ఇస్తామని పేర్కొంది. అలాగే అన్ని హైకోర్టుల్లోని రిజిస్ట్రార్ జనరల్‌ను కూడా ఈ నోటీసుల్లో భాగం చేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. సైబర్ నేరాలకు సంబంధించి చర్య తీసుకునే బాధ్యత రాష్ట్ర చట్టపర సంస్థలదేనని, రాజ్యాంగం ప్రకారం పోలీసులు, ప్రజాభద్రత అంశాలు రాష్ట్రాల పరిధి లోనివని కేంద్రం సుప్రీంకు తెలియచేసింది. రద్దయిన 66 ఎ సెక్షన్ కింద ఎలాంటి కేసులు నమోదు చేయరాదని అన్ని పోలీస్ స్టేషన్లకు ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు, పాలనాధికారులకు మార్గదర్శకాలు జారీ చేశామని కేంద్రం ధర్మాసనానికి తెలియచేసింది. అలాగే ఈ సెక్షన్ కింద ఇంతవరకు ఎన్ని కేసులు నమోదయ్యాయో ఐటి మంత్రిత్వశాఖకు నివేదికలు సమర్పించాలని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరినట్టు చెప్పింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News