ప్రతిపక్షాల నిరసనల మధ్య చర్చ లేకుండానే..
న్యూఢిల్లీ: సాధారణ బీమా చట్టానికి సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఎలాంటి చర్చ లేకుండానే బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. సాధారణ బీమా వ్యాపారం(జాతీయకరణ) సవరణ బిల్లు2021 పేరుతో ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బీమా కంపెనీలకు ప్రైవేట్ మార్కెట్ నుంచి పెట్టుబడులను స్వీకరించేందుకు వీలుగా చట్ట సవరణ చేస్తూ ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. సభ ఆర్డర్లో ఉంటే ఈ బిల్లుపై ప్రతిపక్షాల ప్రశ్నలకు తాను సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని నిర్మల ఈ సందర్భంగా అన్నారు. చర్చకు వారు సిద్ధంగా ఉంటే సభలో కూర్చునేవారంటూ ప్రతిపక్షాలను ఆమె విమర్శించారు. లోక్‌సభలో కాంగ్రెస్‌పక్షం నేత అధీర్రంజన్చౌదరి ఈ బిల్లుపై చేసిన విమర్శలకు ఆమె కౌంటరిచ్చారు.
ఎంపిక చేసిన వ్యాపార సంస్థలకు ప్రజా ఆస్తుల్ని కట్టబెట్టేందుకే సవరణ బిల్లును తెచ్చారని ఆయన ఆరోపించారు. ఈ బిల్లు ప్రజా వ్యతిరేకం, జాతి వ్యతిరేకమని ఆయన విమర్శించారు. తక్కువ ప్రీమియంతోనే ప్రైవేట్ సంస్థలు మెరుగైన బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయంటూ నిర్మలాసీతారామన్ బిల్లును సమర్థించుకున్నారు. పెగాసస్ స్పైవేర్, వ్యవసాయ చట్టాలు, తదితర అంశాలపై ప్రతిపక్షాలు ఎప్పటిలాగే నిరసనలకు దిగడంతో బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం సభ మంగళవారానికి వాయిదా పడింది. ఓ బీమా కంపెనీతోపాటు రెండు ప్రభుత్వరంగ బ్యాంకుల్ని ప్రైవేట్‌పరం చేయనున్నట్టు ఈ ఏడాది బడ్జెట్ సమావేశాల్లోనే ఆర్థికమంత్రి వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభుత్వరంగంలో నాలుగు బీమా కంపెనీలున్నాయి. వాటిలో ఒకటి ప్రైవేట్ కానున్నది.