Saturday, November 23, 2024

పసిడి ఆశలు ఆవిరి

- Advertisement -
- Advertisement -

India's defeat in the Hockey semis

హాకీ సెమీస్‌లో భారత్ చిత్తు, కాంస్యం కోసం జర్మనీతో పోరు

టోక్యో: వరుస విజయాలతో టోక్యో ఒలింపిక్స్‌లో పెను ప్రకంపనలు సృష్టించిన భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లో ఘోర పరాజయం పాలైంది. మంగళవారం వరల్డ్ చాంపియన్ బెల్జియంతో జరిగిన పోరులో మన్‌ప్రీత్ సింగ్ సేన ఒత్తిడికి తట్టుకోలేక ఓటమి చవిచూసింది. అసాధారణ ఆటను కనబరిచిన బెల్జియం 52 తేడాతో భారత్‌ను చిత్తు చేసి పసిడి పోరుకు దూసుకెళ్లింది. ఇక సెమీస్‌లో ఓడిన టీమిండియా గురువారం జరిగే మ్యాచ్‌లో కాంస్యం కోసం జర్మనీతో తలపడుతుంది.

ఒత్తిడిని తట్టుకోలేక..

బెల్జియంతో పోరు అనగానే భారత్ ఒత్తిడికి గురికావడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కూడా అలాంటి ఫలితమే ఎదురైంది. చివరి క్వార్టర్ భారత్ తీవ్ర ఒత్తిడికి గురైంది. అప్పటి వరకు విజయం దిశగా సాగిన టీమిండియా ఒక్కసారిగా లయను కోల్పోయింది. ఇక బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెండ్రిక్స్ హ్యాట్రిక్ గోల్స్‌తో భారత ఆశలపై నీళ్లు చల్లాడు. అలెగ్జాండర్ 19, 49, 53 నిమిషాల్లో గోల్స్ చేసి బెల్జియంను ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. సెమీస్‌కు చేరే క్రమంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడిన టీమిండియా ఈ మ్యాచ్‌లో మాత్రం ఆ స్థాయి ఆటను కనబరచలేక పోయింది. ఒత్తిడిని జయించడంలో విఫలం కావడంతో చారిత్రక విజయం సాధించలేక పోయింది.

ఆరంభంలో దూకుడు..

ఇక ఆట ఆరంభంలో భారత్ ఆధిపత్యం చెలాయించింది. బెల్జియంకు గట్టి పోటీ ఇస్తూ ముందుకు సాగింది. బెల్జియం ఆటగాడు లుయిపెర్ట్ రెండో నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి తన జట్టుకు ఆధిక్యాన్ని అందించాడు. అయితే ఐదు నిమిషాల తర్వాత భారత్ స్కోరును సమం చేసింది. ఏడో నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచి ప్రత్యర్థి ఆధిక్యాన్ని 11తో సమం చేశాడు.

ఆ వెంటనే భారత్ మరో గోల్‌ను తన ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ 9వ నిమిషంలో అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో భారత్‌కు 21 ఆధిక్యాన్ని అందించాడు. మరోవైపు బెల్జియం కూడా దూకుడుగా ఆడుతూ స్కోరును సమం చేసేందుకు ప్రయత్నించింది. భారత గోల్ పోస్ట్‌పై పదేపదే దాడులు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇదే సమయంలో వరుసగా మూడు పెనాల్టీ కార్నర్‌లను బెల్జియం సాధించింది. ఇక 19వ నిమిషంలో అలెగ్జాండర్ హెండ్రిక్స్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలచడంలో సఫలమయ్యాడు. దీంతో స్కోరు 22తో సమమైంది.

హోరాహోరీ..

ఆ తర్వాత కూడా ఇరు జట్లు సర్వం ఒడ్డి పోరాడాయి. ఆధిక్యాన్ని అందుకునేందుకు ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. రెండు జట్లు కూడా దూకుడును ప్రదర్శించడంతో పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఈ క్రమంలో భారత్ ప్రత్యర్థి గోల్ పోస్ట్ వైపు దాడులు చేస్తూ గోల్స్ కోసం ప్రయత్నించింది. అయితే బెల్జియం ఆటగాళ్లు పటిష్టమైన డిఫెన్స్‌తో భారత దాడులను సమర్థంగా అడ్డుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఐదు పెనాల్టీ కార్నర్‌లు లభించినా ఫలితం లేకుండా పోయింది. అందులో ఒకదాంట్లో మాత్రమే గోల్ నమోదైంది. ఇక చివరి క్వార్టర్‌లో భారత్ పన్నిన వ్యూహం బెడిసి కొట్టింది. టీమిండియా పదేపదే బంతిని అడ్డుకోవడంతో బెల్జియంకు వరంగా మారింది.

ఈ క్రమంలో బెల్జియంకు వరుసగా పెనాల్టీ కార్నర్‌లు లభించాయి. దీన్ని సద్వినియోగం చేసుకోవడంలో బెల్జియం సఫలమైంది. కీలక సమయంలో హెండ్రిక్స్ రెండు గోల్స్ సాధించడంతో బెల్జియం 42 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అంతేగాక ఆట ఆఖరి సెకన్‌లో డొహెమన్ మరో గోల్ చేయడంతో బెల్జియం 52 మ్యాచ్‌ను గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 31 గోల్స్ తేడాతో జర్మనీని ఓడించి స్వర్ణం పోరుకు దూసుకెళ్లింది. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన ఆస్ట్రేలియా అలవోక విజయంతో ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News