వాషింగ్టన్ : అమెరికాలో కరోనా వైరస్ మళ్లీ కల్లోలం రేపుతోంది. గత ఏడాది విలయం సృష్టించిన కరోనా మళ్లీ గత కొన్ని రోజులుగా చెలరేగుతోంది. గత 24 గంటల్లో అమెరికాలో దాదాపు లక్షన్నర కొత్త కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తరువాత మళ్లీ ఇంతగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గత వారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో అత్యధిక భాగం అమెరికా నుంచే ఉంటున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లోనే కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అమెరికా మొత్తం మీద వస్తున్న కొత్త కేసుల్లో మూడో వంతు ఈ రాష్ట్రాల్లోనే కావడం గమనార్హం. మంగళవారం ఒక్క రోజే అమెరికాలో 1,49,788 ఇన్‌ఫెక్షన్లు బయటపడగా మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 3.53 కోట్లకు చేరింది. అలాగే మరో 668 మంది మృతి చెందగా, ఇప్పటివరకు కరోనాకు బలై పోయిన వారి సంఖ్య 6.14 లక్షలకు చేరింది. కేసులు భారీగా వస్తుండడంతో అనేక రాష్ట్రాలు మళ్లీ కొవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నాయి.