బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తెలివైన నాయకుడు, ఆవేశపరుడు కాదు. పరిస్థితులు ఎంతగా రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా, నిగ్రహంతో వ్యవహరించగల నేర్పరి. లోపల అగ్గి రగులుతున్నా దాన్ని బయటకు కనిపించనీయకుండా ప్రశాంత చిత్తుడుగా ఉండగలడు. అందుకే గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తెర వెనుక పావులు కదిపి తన పార్టీని నామ మాత్రపు స్థాయికి కుదించి వేసినా తనను ఎన్‌డిఎ కూటమిలో మైనారిటీ పక్ష నేతగా మార్చి వేసినా దానితో తెగ తెంపులు చేసుకోకుండా అది ఇచ్చిన ముఖ్యమంత్రి పీఠాన్ని కిమ్మనకుండా స్వీకరించి కథ నడిపించుకొని పోగలుగుతున్నాడు. అలాగని వెన్నెముకలేని నిత్య విధేయుడుగా, డూడూ ముఖ్యమంత్రిగా నడుచుకునే కీలుబొమ్మ కాడాయన. కీలెరిగి వాత పెట్టగల చేవ, చైతన్యం పరిపూర్ణంగా ఉన్నవాడు. సోషలిస్టు రాజకీయాల్లో తలమునకలైన గతం, అత్యంత వెనుకబడిన తరగతుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని కాపాడుకుంటున్న వర్తమానం నితీశ్ కుమార్‌ను ఇప్పటికీ, ఎప్పటికీ విశిష్ట నేతగా నిలబెడతాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ప్రతి రోజూ ఉభయ సభలను దద్దరిల్లజేసి వేరే ఏ కార్యక్రమం చేపట్టనీయకుండా వాయిదాలకు గురి చేస్తున్న పెగాసస్ స్పై వేర్ వ్యవహారంలో నితీశ్ కుమార్ ప్రతిపక్షాల వాదనను గట్టిగా సమర్థిస్తూ బాహాటంగా మాట్లాడడం గమనించవలసిన విషయం.
పెగాసస్ దొంగ చెవుల వ్యవహారం మీద, ప్రముఖుల ఫోన్ సంభాషణలను రహస్యంగా విని తెలుసుకోడం గురించి పార్లమెంటులో చర్చ జరగాల్సిందేనని నితీశ్ కుమార్ కుండబద్దలు కొట్టినట్లు అన్నారు. ఈ రోజుల్లో ఎవరి ఫోన్లను ఎవరు వింటున్నారో తెలుసుకోలేని పరిస్థితి తలెత్తింది, ఈ విషయంపై దర్యాప్తు కూడా జరిపి తీరాల్సిందేనని ఆయన ఎటువంటి అస్పష్టతకూ తావివ్వకుండా, నీళ్లు నమలకుండా ప్రకటించారు. పాట్నాలో ముఖ్యమంత్రిగా తాను నిర్వహించే జనతా దర్బార్‌లో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు మంగళవారం నాడు ఈ విధంగా సమాధానమిచ్చారు. ఇది బిజెపి కేంద్ర నాయకత్వానికి ఆగ్రహం కలిగించకుండా ఉండే అవకాశం బొత్తిగా లేదు. అయితే దానిని అది ఎప్పుడు ఏ రూపంలో వ్యక్తం చేస్తుందో చెప్పలేం. వాస్తవానికి తన ఫోన్లపైన కూడా కేంద్రం నిఘా ఉంచుతున్నదనే భావన నితీశ్ కుమార్‌లో కలిగి ఉండవచ్చు. ఎందుకంటే గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బిజెపి, నితీశ్ నాయకత్వంలోని జెడి(యు)ల మధ్య పరస్పరం అనుమానాలు తలెత్తాయి. అందుచేత తనపైన కూడా పెగాసస్ నిఘా సాగుతున్నదని ఆయన భావిస్తూ ఉండవచ్చు.
ఏమైనప్పటికీ నితీశ్ ప్రతిపక్షాల నిరసనకు నైతిక మద్దతును ప్రకటించారు. దీనితోపాటు బిజెపికి బొత్తిగా ఇష్టం లేని కుల ప్రాతిపదిక జన గణన కోసం నితీశ్ మళ్లీ డిమాండ్ చేయడం ప్రారంభించారు. జెడి(యు) కోరుతున్న కుల జన గణనను అదే పనిగా కేంద్రం తిరస్కరిస్తూ పోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ పని చేస్తుందని నితీశ్ కుమార్ హెచ్చరించారు. ఈ విషయమై ప్రధాన మంత్రికి బీహార్‌లోని అన్ని పార్టీల చేత ఉమ్మడి లేఖ రాయించాలని యోచిస్తున్నానని కూడా ఆయన వెల్లడించారు. కులాల జనగణన గతంలో బ్రిటిష్ వారి హయాంలో జరిగిందని దానిని తాజాగా మళ్లీ జరిపించాలని తాను 1990 నుంచి డిమాండ్ చేస్తున్నానని అది జరిగితే దేశంలోని ప్రతి ఒక్క సామాజిక వర్గం హర్షిస్తుందని, దేశంలో మెరుగైన పరిపాలనకు కూడా తోడ్పడుతుందని నితీశ్ కుమార్ అన్నారు. అంతేకాదు లోపాలున్నాయని సాకు జూపి దేశంలోని కులాల జాబితాను కేంద్రం విడుదల చేయకపోడాన్ని కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ జాబితాను 2013 వరకే తాజా పరిచినట్టు తమకు తెలిసిందని అందులో లోపాలేమైనా ఉంటే వాటిని తాజా జన గణన ద్వారా తొలగించవచ్చునని నితీశ్ అన్నారు.
కుల ప్రాతిపదిక జనాభా లెక్కల సేకరణ వల్ల సామాజిక అశాంతి తలెత్తుతుందని కొంత మంది బిజెపి నాయకులు చేస్తున్న ప్రకటనలను ప్రస్తావిస్తూ కుల గణన కోసం 2019లోనే శాసన సభ తీర్మానం చేసిన విషయాన్ని ఆయన ఉదహరించారు. అణగారిన సామాజిక వర్గాల అభ్యున్నతిని కోరే తత్వం గల నితీశ్ నాయకత్వంలోని జెడి(యు)కి అగ్రవర్ణ ఆధిపత్యాన్ని పట్టించుకోకుండా మత ప్రాతిపదిక మీద హిందువులందరినీ కలపాలని చూసే బిజెపికి వాస్తవానికి మైత్రి కుదిరే అవకాశం లేదు. బీహార్‌లో గల ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్వప్రయోజనం కోసం ఈ రెండు పార్టీలు కలిసి నడుస్తున్న సంగతి అందరికీ తెలుసు. నితీశ్ కుమార్ కుల ప్రాతిపదిక జనాభా లెక్కల కోసం ఈ విధంగా పట్టుపట్టడం ఎంత వరకు తీసుకు వెళుతుందో, లేదా బిజెపి, జెడి (యు) ల మధ్య లాలూచీ కుస్తీగానే ముగిసిపోతుందో చూడాలి.