భర్త చేతిలో భారతీయ మహిళ చిత్రహింసలు
వాషింగ్టన్: కన్నవారిని వదిలి కట్టుకున్న భర్తతో కాపురం చేయడానికి అమెరికా వచ్చిన ఒక భారతీయ మహిళ అతను పెట్టే చిత్రహింసలు భరించలేక న్యాయం కోసం దేశం కాని దేశంలో నానా అగచాట్లు పడుతోంది. ఎటువంటి ఆర్థిక సహాయం అందచేయకుండా తన భర్త తనను వదిలివేశాడని, తలదాచుకోవడానికి తనకు ఇక్కడ గూడు కూడా లేదని, తన మామగారిని భారత్‌లో ఉన్న తన తల్లిదండ్రులు సంప్రదించగా అదనపు కట్నం ఇస్తే తన భర్త జీవితంలోకి మళ్లీ తీసుకువస్తానని ఆయన డిమాండు చేస్తున్నాడని బీహార్‌లోని పాట్నాకు చెందిన బాధిత మహిళ ఇక్కడి ఇండియన్ ఎంబసీ, శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆక్రోశించింది.
2021 మార్చి 1న తాను తన భర్తతో కలసి అమెరికా వచ్చానని, వర్జీనియా 22102లోని మెక్లీన్లో తాము ఉండసాగామని అనామిక(పేరు మార్చడం జరిగింది) తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక్కడకు వచ్చిన కొద్ది రోజులకే తన భర్త తనపై గృహహింస మొదలుపెట్టాడని, తన తల్లిదండ్రుల నుంచి మరింత కట్నం కావాలని వేధించసాగాడని ఆమె తెలిపారు. ఎఫ్-1 వీసాపై అమెరికా వచ్చిన తన భర్త ఫ్రెడ్డిక్ మాక్‌లో తాత్కాలికంగా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్(ఓపిటి) ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. గర్భ నిరోధం కోసం తాను ఏదో చేస్తున్నానన్న అనుమానంతో తాను వాష్‌రూమ్ వెళ్లినపుడు తలుపులు కూడా వేసుకోవడానికి తన భర్త అనుమతించే వాడు కాదని ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. ఒక రోజు తనను నడిరోడ్డుపై మోకాలిపై కూర్చోపెట్టి చిత్రహింసలకు గురిచేశాడని కూడా ఆమె పేర్కొన్నారు.
భర్త పెట్టే హింసను తట్టుకోలేని పరిస్థితులలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా జూన్ 15న వారు ఆమెను రక్షించి అక్కడ నుంచి తరలించారు. ఆమెపై స్థానిక ఫెయిర్‌ఫాక్స్ కౌంటీ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సీటెల్‌లోని తన సమీప బంధువు ఇంట్లో తలదాచుకున్న అనామిక న్యాయం కోసం పలు ప్రభుత్వేతర సంస్థలను కూడా సంప్రదిస్తున్నారు. గడచిన దశాబ్ద కాలంగా ఈ తరహా గృహ హింస కేసులు అమెరికాలో పెరిగిపోతున్నాయని దక్షిణాసియా మైనారిటీస్ అలయెన్స్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పునీత్ అహ్లువాలియా తెలిపారు. అమెరికాలో పనిచేసే భారతీయులను వివాహం చేసుకుని చిత్రహింసలకు గురవుతున్న భారతీయ మహిళల పరిస్థితిని అమెరికా విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.