పోలీసుశాఖలో పెరుగుతున్న ఆందోళన
బోనాల బందోబస్తుతో వైరస్ సోకితుందోనని భయం
ఆసుపత్రులకు వెళ్లి టెస్టులు చేస్తుకుంటున్న సిబ్బంది
నగరంలో రోజు 70కిపైగా బయటపడుతున్న పాజిటివ్ కేసులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో మళ్లీ కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుంది. బోనాల ఉత్సవాలు ప్రారంభమైన తరువాత మహమ్మారి చాపకింది నీరుల్లా విస్తరిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. రెండు రోజుల కితం పోలీసు కానిస్టేబుల్‌కు వైరస్ సోకి చనిపోవడంతో ఆశాఖ ఉన్నతాధికారులు కలవర పడుతున్నారు. బోనాల పండగకు పెద్ద ఎత్తున బందోబస్తు పోలీసులను ఏర్పాటు చేయడంతో స్దానిక ప్రజల నుంచి సోకినట్లు పేర్కొంటున్నారు. టెస్టులు చేస్తే ఇంకా పాజిటివ్ కేసులు బయటపడ వచ్చని పేర్కొంటున్నారు. విధులు నిర్వహించిన పోలీసు కానిస్టేబులందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచించడంతో సమీప డయాగ్నస్టిక్ సెంటర్లు వెళ్లి పరీక్షలు చేయించుకుంటున్నారు.
మరోపక్క వైద్యాధికారులు కూడా జనం పెద్ద గుంపులుగా తిరగడంతో వైరస్ విస్తరించే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో రోజు నమోదైతున్న కేసులో అత్యధికంగా నగరం నుంచి 70కిపైగా పాజిటివ్ కేసులు వస్తున్నట్లు, ఈసంఖ్య గత 15 రోజుల నుంచి నమోదైతున్నట్లు చెబుతున్నారు. అదే విధంగా గాంధీ, టిమ్స్ ఆసుపత్రులకు రోజుకు 35నుంచి 40మంది పాజిటివ్ సోకిన రోగులు వస్తున్నట్లు ఆసుపత్రులు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇంకా కేసులు పెరగవచ్చని భావిస్తున్నారు. దీని దృష్టిలో పెట్టుకుని థర్డ్‌వేవ్ పొంచి ఉందని అంచనా వేస్తూ ఆసుపత్రుల్లో పడకలు, అక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గత నెలల్లో కురిసిన భారీ వర్షాలకు సీజనల్ వ్యాధులు తోడు కావడంతో వాటి లక్షణాలు కూడా దగ్గు, జ్వరం, జలుబు ఉండటంతో ప్రజలు టెస్టులు చేయించుకోవడంతో పాజిటివ్ బయటపడుతుంది.
ఇటీవల పోలీసులు నిర్వహించిన తనిఖీలో రోడ్లపై దుకాణాల్లో తిరిగే వారిలో 40శాతం మందికి మాస్కులు పెట్టుకోవడంలేదని, వ్యాపార సముదాయాల వద్ద శానిటైజర్లు అందుబాటులో లేవని గుర్తించారు. ప్రజలు ఇష్టానుసారంగా తిరిగితే కరోనా రెక్కలు కట్టుకుంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రజలు నిర్లక్షం చేస్తే మహమ్మారి ఉనికి చాటుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని జిల్లా వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నాలుగు నెలల నుంచి వైద్యసిబ్బంది కరోనాతో పోరాటం చేస్తూ పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనారని, మళ్లీ మహమ్మారి పంజా విసిరితే గతంలో చవిచూసిన రెండ్‌వేవ్‌ల కంటే ప్రమాదంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నగర ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి, మాస్కులు, భౌతికదూరం, శానిటైజ్ వినియోగిస్తే కరోనా విజృంభించకుండా కట్టడి చేయవచ్చని గాంధీ ఆసుపత్రి వైద్యులు సూచిస్తున్నారు.