ఎపిలోని గుంటూరు జిల్లా
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో కంపించిన భూమి
పులిచింతలలో 2.3, 2.7, 3.0
సూర్యాపేట జిల్లాలో 1.8గా భూకంప తీవ్రత నమోదు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో వరుస భూప్రకంపనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో ఆదివారం ఉదయం భూప్రకంపనలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఎపిలోని గుంటూరు జిల్లాతో పాటు తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పులిచింతల సమీపంలో ఆదివారం ఉదయం 7.15 నుంచి 8.20 గంటల మధ్య మూడుసార్లు భూమి కంపించిందని అధికారులు తెలిపారు. పులిచింతల సమీపంలోని జడపల్లితండా, మాదదిరిపాడులో రెండుసార్లు స్వల్ప భూప్రకంపనలు సంభవించగా రిక్కర్ స్కేల్ పై భూకంప తీవ్రత 2.3, 2.7, 3.0గా నమోదైనట్లు ఎన్‌జీఆర్‌ఐ తెలిపింది. వారం రోజులుగా పులిచింతల సమీపంలో భూమి కంపిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. పులిచింతల ప్రాజెక్ట్ 16వ గేట్ మరమ్మతు కారణంగా నీటిమట్టం తగ్గించడంతో భూమి పొరల్లో ఏర్పడిన సర్దుబాట్ల కారణంగా భూమి కంపించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
చింతలపాలెం మండల కేంద్రంలో వరుస భూ ప్రకంపనలు
దీంతో పాటు తెలంగాణలోని సూర్యాపేట, చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. స్థానికులు భయాందోళన చెందారు. చింతలపాలెం మండల కేంద్రంలో వరుస భూ ప్రకంపనలతో ప్రజలు వణుకుతున్నారు. భూమి కంపించడంతో జనం ఇళ్లల్లో నుంచి పరుగులు పెట్టారు. ఆదివారం ఉదయం 7:40, 8:20 గంటలకు భూ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 1.8గా నమోదయ్యిందని, రెండు రోజుల క్రితం కూడా భూమి కంపించిందని ఎన్జీఆర్‌ఐ అధికారులు తెలిపారు.