నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ: గత రాత్రి దిండు పక్కన గోల్డ్‌మెడల్ పెట్టుకుని నిద్రపోయినట్లు నీరజ్ చోప్రా తెలిపాడు. టోక్యో ఒలింపిక్స్లో శనివారం జావెలిన్ త్రోలో ఆయన బంగారు పతకం గెలిచిన సంగతి తెలిసిందే. వందేండ్ల నిరీక్షణ అనంతరం అథ్లెటిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం తెచ్చిపెట్టిన ఘనత సాధించిన 23 ఏండ్ల నీరజ్ చోప్రా ఆదివారం పలు జాతీయ టీవీ చానల్స్‌కు ప్రత్యేక ఇంటర్యూలు ఇచ్చాడు. గోల్డ్‌మెడల్ సాధించినఅనంతరం తన తలలోని భారమంతా తొలిగిపోయిందని అన్నారు. మెడల్ గెలిచిన తర్వాత వేదికపై నిలబడినప్పుడు చాలా విషయాలు తనకు గుర్తుకు వచ్చాయని నీరజ్ చోప్రా చెప్పాడు. గాయపడినప్పుడు తన భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందినప్పటినుంచి టోక్యోకు విమానంలో రావడం వరకు అన్నీ తన మదిలో మెదిలాయన్నాడు.
దేవుడు తనకు ఏది ఇచ్చినా అది తన మంచి కోసమే అనిపించిందని నీరజ్ చెప్పాడు. తాను పోడియం మీద నిలబడి ఉన్నప్పుడు తొలిసారి జాతీయ గీతం ప్లే చేసినప్పడు కన్నీళ్లు రాలేదన్నాడు. అయితే ఆ సమయంలో చాలా భావోద్వేగాలను అనుభవించినట్లు ఆయన చెప్పాడు. గోల్డ్‌మెడల్ సాధించిన ఆనందంలో శనివారం రాత్రి తాను చాలా సేపు సరిగా నిద్రపోలేదని నీరజ్ తెలిపాడు. బెడ్ మీద ఉన్నంత సేపు తన దిండు పక్కన మెడల్ ఉన్నదని అన్నాడు. గోల్డ్ మెడల్ సాధించానన్న భావనలోనే ఇంకా మునిగి ఉన్నానని, ఇది ఏదో ఒక కొత్త రూపంలో తనకు కలుగుతున్నదని చెప్పాడు. దేశం కోసం తాను ఏదో చేయగలిగాను అన్న ఫీలింగ్ తనలో ఉండిపోయిందని, అది ఎప్పటికీ గుర్తుండిపోతుందని నీరజ్ అన్నాడు.