ఆయన కుటుంబ సభ్యుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతా
టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు జై శ్రీనివాస్ ఇటీవల అనారోగ్య కారణాలతో మృతిచెందడంతో ఆయన కుటుంబం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ విషయం తెలుసుకున్న టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల జై శ్రీనివాస్ కుటుంబసభ్యులను శనివారం పరామర్శించారు. జై శ్రీనివాస్ కూతురుకు ఆన్‌లైన్ ఉచితంగా శిక్షణ అందిస్తానని హామీ ఇచ్చారు. దీంతోపాటు వారి కుటుంబ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి ఆయన భరోసా ఇచ్చారు. జై శ్రీనివాస్ ఇటీవల కరోనాతో కన్నుమూయగా ఆయన భార్య, ఇద్దరు కుమార్తెల పరిస్థితి దయనీయంగా మారింది. వారి పరిస్థితిని తెలుసుకున్న సందీప్ మక్తాల ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా జై శ్రీనివాస్ రెండో కుమార్తె జైత్ర చక్కని గాత్రంతో పలు పాటలు ఆలపించింది.
ఆ చిన్నారి గాత్రానికి ముగ్ధుడైన సందీప్ మక్తాల శాలువా కప్పి సన్మానించారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న ఆ చిన్నారికి టీటా తరఫున పూర్తి అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. తమ కుటుంబం ఓ కిరాయి ఇంట్లో ఉంటోందని, కళాకారులకు చిత్రపురి కాలనీలో ఇళ్లు స్థలాలు కేటాయించగా తాము ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నా ఎలాంటి కేటాయింపులు జరగలేదన్న విషయాన్ని జై శ్రీనివాస్ కుటుంబసభ్యులు సందీప్ మక్తాల దృష్టికి తీసుకువెళ్లారు. వారికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం దృష్టికి, మంత్రి కెటిఆర్ దృష్టికి తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చారు. జై శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తమవంతు సాయం చేసేందుకు త్వరలో తమ కమిటీ సమావేశం కానుందని సందీప్ మక్తాల తెలిపారు.