పెగాసస్‌పై సుప్రీం విచారణ కొనసాగింపు
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్‌తో స్నూపింగ్ ఆరోపణలపై దాఖలు అయిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు సోమవారం కొనసాగిస్తుంది. సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సారథ్యపు త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుంది. పెగాసస్ స్పైవేర్‌తో స్నూపింగ్‌కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా? ఇస్తే వాటి వివరాలు ఏమిటీ? అనేది తెలిచేసేలా సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించాలని పిటిషనర్లు అభ్యర్థించారు. పెగాసస్ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు.
అయితే ఈ లోగానే సోషల్ మీడియా ద్వారా కొందరు పిటిషనర్లు తమ జర్నలిస్టు అనుభవాలతో పెగాసస్‌పై చర్చలకు దిగడం కేవలం సమాంతర విచారణ కిందికి వస్తుందని ఈ నెల 10వ తేదీన అత్యున్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషనర్లు క్రమశిక్షణ పాటించాల్సి ఉంటుంది, వారు ఏ వ్యవస్థ పట్ల అయినా కనీస విశ్వాసంపాటించాల్సి ఉందని, దీనికి విరుద్ధంగా వ్యవహరించడం అనుచితం అవుతుందని ధర్మాసనం తెలిపింది. ఇటువంటివి ఇక ముందు జరగరాదని పేర్కొంటూ విచారణను వాయిదా వేసిన న్యాయస్థానం ఇప్పుడు దీనిని తిరిగి చేపడుతుంది. పిటిషనర్లు ఈ అంశంపై సరైన ఆసక్తితో ఉంటే నిజానిజాలు తెలుసుకోవాలనుకుంటే వాటిని కోర్టుల పరిధిలో జరిగే సంవాదంలో పాల్గొనాల్సి ఉంటుంది తప్ప ఇతర చోట్ల వెలుపలి వేదికల నుంచి కాదని ధర్మాసనం సీనియర్ జర్నలిస్టులకు చురకలు పెట్టింది.